Mahaa Daily Exclusive

  సుప్రీం తీర్పు తర్వాతే…..

Share

  • సుప్రీం తీర్పు తర్వాతే
  • బ్యాలెట్‌తో ఎన్నికలు
  • ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా
  • ఫిబ్రవరి 5 నాటి ఓటర్ల జాబితానే ప్రాతిపదిక అని స్పష్టం
  • దశలవారీగా ఎన్నికలుంటాయని వెల్లడి

అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సన్నద్ధమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. గత రెండు నెలలుగా ఎన్నికల సన్నద్ధతపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్ల ద్వారానే నిర్వహించనున్నట్లు పునేఠా స్పష్టం చేశారు. ఎన్నికల కోసం అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు సంబంధించిన ప్రింటింగ్‌ ప్రెస్‌ను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు 2026 ఫిబ్రవరి 5 నాటికి ఉన్న ఫొటో ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. ఎన్నికలను దశలవారీగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పునేఠా పేర్కొన్నారు.

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల ప్రతినిధులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. పోలింగ్‌ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు, అధికారుల సన్నద్ధతపై సమీక్షించారు. గత రెండు నెలలుగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని పునేఠా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని ఎస్‌ఈసీ పేర్కొంది. తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయని పునేఠా తెలిపారు.