Mahaa Daily Exclusive

  అధికారంలోకి వచ్చేది మేమే…

Share

  • అధికారంలోకి వచ్చేది మేమే
  • కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చినట్లు, మంత్రులు డ్రామా చేశారు
  • రిజర్వాయర్ల కెపాసిటీ పెంపు, జేబులు నింపుకునేందుకే
  • మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
  • బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ డీకే అరుణ.

గద్వాల, మహా : రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు పేరుతో కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మూడేళ్లలో.. పెండింగ్ ప్రాజెక్టులలో తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. రిజర్వాయర్ల పనులను రెండేళ్లలో పూర్తి చేస్తారా అని నిలదీశారు. గద్వాల జిల్లా గట్టు మండలంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఎంపీ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇళ్లు ఇస్తోందని విమర్శించారు. దీనిని ప్రజా ప్రభుత్వం అంటారా అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో అర్హులందరికీ పార్టీలు చూడకుండా ఇళ్లు ఇచ్చామని తెలిపారు. గద్వాల మున్సిపాలిటీలో పన్నుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తూ, లెక్కల్లో మాత్రం లక్షల రూపాయలుగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఇలా కొనసాగితే గద్వాల్‌ను నాలుగు రోజుల్లోనే అమ్మేస్తారని తీవ్రంగా విమర్శించారు.

నీటి విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రాత్రికి రాత్రే మంత్రులు కర్ణాటకకు వెళ్లి డ్రామా చేశారని విమర్శించారు. వర్షాలతో వచ్చిన నీటిని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన నీరుగా అబద్ధపు ప్రచారం చేసి ప్రజలను మోసం చేశారని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదని పేర్కొన్నారు. నీటి కోసం రైతులు ఆందోళనలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని డీకే ఆరోపించారు. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి గతంలో గద్వాల్‌లో టీఆర్‌ఎస్‌ గెలిచిందని విమర్శించారు. ఎమ్మెల్యేలు ప్రజలకు సేవ చేయడానికి కాకుండా సంపాదించుకోవడానికే వచ్చామని భావిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. బీజేపీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉందని, తెలంగాణలో తదుపరి అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి, జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండల వెంకటరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే, జిల్లా ఉపాధ్యక్షుడు బలిగేరా నల్లారెడ్డి, జిల్లా కోశాధికారి మీర్జాపురం రామచంద్రారెడ్డి, గద్వాల్ పోటీ చేసిన అభ్యర్థి బలిగేరా శివారెడ్డి, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి అక్కల రమాదేవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు దాస్, మండల అధ్యక్షుడు గట్టు సురేష్, కౌన్సిలర్లు శాలన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.