Mahaa Daily Exclusive

  దోపిడీకి చెక్ పెట్టాం….

Share

  • దోపిడీకి చెక్ పెట్టాం
  • దొంగల చేతుల్లోకి వెళ్లకుండా రూ.5 లక్షల కోట్లు కాపాడా
  • ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, మహా : యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన మార్పులను వివరిస్తూ, మొబైల్ ఫోన్లు కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా పారదర్శక పాలనకు బలమైన సాధనంగా మారాయని కొనియాడారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఇప్పటివరకు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఏకంగా రూ. 50 లక్షల కోట్లను నేరుగా జమ చేశామని వెల్లడించారు. ఈ డిజిటల్ వ్యవస్థ వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోయి, తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా దాదాపు రూ. 5 లక్షల కోట్ల ప్రజాధనం ఆదా అయిందని స్పష్టం చేశారు. పేదలకు మేలు చేసే ఈ చర్యలను ఎంతమంది విమర్శించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

అక్రమ సంపాదన ఆగిపోయిన వారు తనను ఎందుకు ప్రేమిస్తారని మోదీ ప్రశ్నించారు. ఎన్ని విమర్శలు వచ్చినా అవినీతి రహిత పాలన కోసం తన పోరాటం ఆగదని తేల్చేశారు. గతంలో సాంకేతికత కొద్దిమంది సంపన్నులకే పరిమితమై ఉండేదని, డిజిటల్ ఇండియా ఉద్యమం ద్వారా సాంకేతికతను సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చి ప్రజాస్వామీకరించామని ప్రధాని గుర్తుచేశారు. భారత్‌లోనే మొబైల్స్, టెలికాం పరికరాల తయారీని విస్తరించి విదేశీ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించామని వివరించారు. దేశంలో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరించిన తీరును మోదీ ప్రస్తావించారు. దేశంలోని ప్రతి జిల్లాకు 5జీ సాంకేతికత చేరిందని, ప్రస్తుతం 5.5 లక్షలకు పైగా 5జీ బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. 2022తో పోలిస్తే దేశంలో మొబైల్ ఇంటర్నెట్ వేగం పది రెట్లు పెరిగిందని వెల్లడించారు. 2022లో ఐఎంసీ వేదిక నుంచే ప్రారంభమైన 5జీ విప్లవం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోల్‌అవుట్‌లలో ఒకటిగా నిలిచిందని ప్రశంసించారు.