- ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అఖిలపక్ష పాదయాత్ర
- రాహుల్ గాంధీ అరెస్టు కేంద్రం నిరంకుశ వైఖరికి పరాకాష్ఠం
- జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
- అఖిలపక్ష నాయకులు, కూడా చైర్ పర్సన్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు అయూబ్ డిమాండ్
వరంగల్, మహా ;
ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బుధవారం వరంగల్‌లో భారీ అఖిలపక్ష పాదయాత్ర నిర్వహించారు.
వరంగల్ పోచమ్మైదాన్ సెంటర్ నుంచి కాశీబుగ్గ అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ పాదయాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, కుడా చైర్మన్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం నినాదాలు చేస్తూ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు.
పాదయాత్ర అనంతరం కాశీబుగ్గ అంబేద్కర్ సెంటర్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ…
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి ఓటు ప్రజల హక్కుకు ప్రతీక అని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.
ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని, ఓటు హక్కును కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అయూబ్ గారు స్పష్టం చేశారు.
అలాగే కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
పాదయాత్రలో నాయకులు “ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి – ఓటు హక్కును పరిరక్షించాలి”, “ఓటు చోరీని అరికట్టాలి”, “సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి” అంటూ నినాదాలు చేశారు.








