న్యూఢిల్లీ, మహా.
ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల సుదీర్ఘ అధికార ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ‘భారతరత్న’ ఎల్.కే. అద్వానీతో భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్లిన ప్రధాని ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన ఛాయాచిత్రాలను ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు.
అద్వానీ నివాసానికి చేరుకున్న ప్రధానమంత్రికి అక్కడ ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రజాసేవలో అద్వానీ అందించిన దశాబ్దాల సేవలను ప్రధాని మోదీ ఘనంగా కొనియాడారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన అపారమైన కృషి చరిత్రలో చెరగని ముద్ర వేసిందని ప్రశంసించారు. భారతదేశ పురోగతిని బలోపేతం చేయడంలో, జాతి నిర్మాణంలో అద్వానీ అత్యంత కీలకమైన పాత్ర పోషించారని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న చరిత్రాత్మక తరుణంలో.. తన రాజకీయ గురువు, పార్టీ కురువృద్ధుడిని స్వయంగా కలిసి ఆశీస్సులు తీసుకోవడం పట్ల బీజేపీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరి భేటీకి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.







