కుషాయిగూడ, మహా : కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామిని రాష్ట్ర ప్రథమ మహిళ జానకి శుక్ల సోమవారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆమెకు దేవస్థాన చైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్‌రెడ్డి స్వాగతం పలికారు. అభిషేకం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. దేవస్థానం తరఫున స్వామివారి ప్రసాదాన్ని అందజేసి, పట్టు వస్త్రాలతో ప్రథమ మహిళను సత్కరించారు. ఆమె పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ నల్ల వెంకటరెడ్డి, తహసీల్దార్ యాదగిరిరెడ్డి, ఏసీపీ చక్రపాణి, సీఐ రమేష్, మున్సిపల్ ఉప కమిషనర్ రామలింగం, దేవస్థాన సిబ్బంది, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.








