Mahaa Daily Exclusive

  వేటుకు సుప్రీంకోర్టు నిరాకరణ….

Share

వేటుకు సుప్రీంకోర్టు నిరాకరణ.
* చట్టవిరుద్ధ నిర్ణయాలు రుజువైతే రద్దు చేస్తామని ధర్మాసనం స్పష్టీకరణ.
* జ్ఞానేశ్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.

ఢిల్లీ, మహా.

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నందున వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం కీలక విచారణ జరిపింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును లోతుగా విచారిస్తూ.. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని కేవలం ఆరోపణల ప్రాతిపదికన బాధ్యతల నుంచి తప్పించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆయనపై వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని, ఎన్నికల సంఘంలో ప్రజాస్వామిక విలువల కన్నా ఏకపక్ష నిర్ణయాలకే పెద్దపీట వేస్తున్నారని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి చర్యల వల్ల దేశ ప్రజాస్వామ్య ప్రక్రియకు, స్వతంత్ర వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ పారదర్శకతకు విఘాతం కలుగుతోందని వారు తమ పిటిషన్లలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాదనలను సావధానంగా విన్న ధర్మాసనం.. సీఈసీని పదవి నుంచి తొలగించే ప్రక్రియ రాజ్యాంగంలో స్పష్టంగా లిఖించబడి ఉందని పరోక్షంగా గుర్తుచేస్తూ, ఆయనను బాధ్యతల నుంచి తప్పించడానికి నిరాకరించింది.
అదే సమయంలో పిటిషనర్లకు న్యాయస్థానం ఒక కీలకమైన భరోసాను ఇచ్చింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు నిజంగానే చట్టవిరుద్ధమని లేదా ఏకపక్షమని న్యాయస్థానంలో రూఢి అయితే, వాటిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. ఆధారాలతో సహా ఆరోపణలు నిరూపితమైతే గనక, ఆయా వివాదాస్పద నిర్ణయాలను తక్షణమే పునఃపరిశీలించడం లేదా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని న్యాయమూర్తులు హెచ్చరించారు. వ్యక్తులను తొలగించడం కంటే, చట్టవ్యతిరేక నిర్ణయాలను సరిదిద్దడం ద్వారా వ్యవస్థను కాపాడటమే న్యాయస్థానం ప్రథమ కర్తవ్యమని ధర్మాసనం వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
ఈ సున్నితమైన వ్యవహారంపై న్యాయపరమైన సమీక్ష జరపడానికి వీలుగా, పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు లేవనెత్తిన ప్రతి ఆరోపణకు, ముఖ్యంగా ఏకపక్షంగా తీసుకున్నారని చెబుతున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను, సహేతుకమైన వివరణలను సమర్పించాలని సూచించింది. ఎన్నికల సంఘం దాఖలు చేసే ఈ సమగ్ర నివేదిక ఆధారంగానే కేసు తదుపరి విచారణ కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే సమాధానంపైనే ఈ కేసుకు సంబంధించిన భవితవ్యం ఆధారపడి ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.