- సీఈసీపై పిటిషన్ల విచారణ
- కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు
- వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది
న్యూఢిల్లీ, మహా : కేవలం పేపర్ రిపోర్ట్ ఆధారంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పనితీరు, చర్యలపై లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. సీఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లో ఎస్ఐటీ విచారణ జరిపించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను సైతం చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని అందులో కోరారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ముగ్గురు ఎన్నికల కమిషనర్లు, క్యాబినెట్ కార్యదర్శి, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీష్ గర్గ్, ఐటీ హెడ్ సీమా ఖన్నాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషనర్ల నియామకంతో పాటు వారికి కల్పించే అధికారాలకు సంబంధించి చట్టంలో మార్పులు చేశారని కోర్టుకు తెలిపారు. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్లు తమ పదవీకాలంలో చేసిన పనులకు సంబంధించి వారిపై ఎలాంటి కేసు నమోదవుకుండా మినహాయింపు ఉంటున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ పనితీరు ప్రక్రియను స్వయంగా నిర్ణయించుకునే అధికారం కూడా ఎన్నికల కమిషనర్లకు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం వికాస్ సింగ్ మాట్లాడుతూ.. “ఈరోజు ప్రధానంగా మా వాదన ఏంటంటే.. దేశ ప్రధానమంత్రికి కూడా లేని రక్షణను ఎన్నికల కమిషనర్లకు ఏ విధంగా కల్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోర్టును కోరుతున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ‘అలా అయితే ఎన్నికల కమిషన్ ఎలా పనిచేస్తుంది?’ అని ప్రశ్నించింది. దానికి లాయర్ వికాస్ సింగ్ ‘సీఈసీతో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పనిచేస్తారు అని బదులిచ్చారు. అయితే మేం మీ పిటిషన్ను పరిశీలించాల్సి ఉందని, ఏ పనైనా చట్టపరిధిలోనే జరుగుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.







