- కేంద్ర మంత్రులకు బీజేపీ షాక్
- యూపీ రాజ్యసభ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
- కేంద్ర మంత్రులు హర్దీప్ పురి, బీఎల్ వర్మలకు దక్కని అవకాశం
- పదవీకాలం ముగిసిన ఏ ఒక్క ఎంపీకి మళ్లీ టికెట్ ఇవ్వని అధిష్ఠానం
- జాబితాలో ఇద్దరు మహిళలు, ముగ్గురు ఓబీసీ, ఇద్దరు ఎస్సీ అభ్యర్థులు
న్యూఢిల్లీ, మహా : ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పదవీకాలం ముగియనున్న ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా ఏ ఒక్క సిట్టింగ్ ఎంపీకి తిరిగి అవకాశం కల్పించకుండా, ఎనిమిది మంది కొత్త ముఖాలను బరిలోకి దింపింది. ముఖ్యంగా కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, బీఎల్ వర్మలను పక్కనపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న 10 రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని బలాబలాల ప్రకారం బీజేపీ ఎనిమిది, సమాజ్వాదీ పార్టీ రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓఝా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోన్కర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్లను అభ్యర్థులుగా అధిష్ఠానం ప్రకటించింది.
2027 ఎన్నికలే లక్ష్యంగా ఎంపిక
2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ సంస్థాగత అనుభవానికి ఇందులో పెద్దపీట వేశారు. ఈ జాబితాలో ముగ్గురు ఓబీసీ, ఇద్దరు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), ముగ్గురు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించడం విశేషం. బారాబంకి మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్, ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కుమార్తె శ్రుతి గంగ్వార్లను మహిళా అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ నిర్ణయంతో పార్టీలో కింది స్థాయి నుంచి పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు బీజేపీ సంకేతాలు పంపింది.







