Mahaa Daily Exclusive

  కన్నుల పండువగా ‘విజయవాడ ఉత్సవ్‌-2’…

Share

కన్నుల పండువగా ‘విజయవాడ ఉత్సవ్‌-2’.
• వేడుకలకు రానున్న రాష్ట్రపతి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
• ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్, లేజర్ షోలు.. జాతీయ స్థాయి కళాకారుల ప్రదర్శనలు.

విజయవాడ, మహా.

బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి వేడుకల వేళ ‘విజయవాడ ఉత్సవ్‌ సీజన్-2’ కన్నుల పండువగా జరగనుంది. ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్ల పనులకు సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో లాంఛనంగా అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ భవన నిర్మాణ కార్మికుల సలహా సంఘం చైర్మన్ గొట్టిముక్కల రఘు, ఏపీ కల్చరల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ తేజస్విని, యువ నాయకుడు బోండా సిద్ధార్థ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ.. ఈ ఏడాది విజయవాడ ఉత్సవాలను అత్యంత అద్భుతంగా, చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ వేడుకలకు భారత రాష్ట్రపతితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారని వెల్లడించారు. దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ చెంత ఆధ్యాత్మికత, ఆహ్లాదం కలగలిపేలా ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా పున్నమి ఘాట్, ఎంబీకే స్టేడియాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా భారీ ఎత్తున తరలివచ్చి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుల పర్యవేక్షణలో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నట్లు గొట్టిముక్కల రఘు వివరించారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమి ఘాట్, సిద్ధార్థ ఫార్మా కళాశాల, పవిత్ర సంగమం తదితర ప్రాంతాల్లో వైవిధ్యభరితమైన కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. స్థానిక కళాకారులతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సాంస్కృతిక బృందాలను నగరానికి రప్పిస్తున్నామని, ఉత్సవాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న లేజర్ షోలు, డ్రోన్ షోలు, క్రాకర్ షోలు (బాణసంచా) సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. ఈ ఉత్సవాల ద్వారా ఎంతో మంది కళాకారులకు రాబోయే కొన్ని నెలల పాటు చక్కటి జీవనోపాధి సైతం లభిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు, యువత, మహిళలు, కుటుంబాల కోసం ప్రత్యేక పోటీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ కల్చరల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ తేజస్విని వెల్లడించారు. ఉత్సవాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి రప్పించిన దాదాపు 45 రకాల పరంపరాగత జానపద కళారూపాలను ప్రదర్శించనున్నామన్నారు. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కళాకారులు, ప్రముఖ గాయకులు, భజన్ జ్యామింగ్ బృందాలు, లైవ్ బ్యాండ్స్ తదితర మ్యూజికల్ కాన్సర్ట్‌లు పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేస్తాయన్నారు. ఇక ఉత్సవాల ఆఖరి రోజైన అక్టోబర్ 20వ తేదీన ఏలూరు రోడ్డులో నిర్వహించే భారీ కార్నివాల్ ఈ వేడుకలకే హైలైట్‌గా నిలవనుందని ఆమె తెలిపారు. మూడు గజరాజులు, అమ్మవారి నవ అవతారాల శకటాలు, ఏకంగా నాలుగు వేల మంది కళాకారుల ప్రదర్శన నడుమ సాగే ఈ ముగింపు వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తేజస్విని వివరించారు.