Mahaa Daily Exclusive

  నిత్యావసరాల మంట.. సర్కారు మొద్దునిద్ర!

Share

నిత్యావసరాల మంట.. సర్కారు మొద్దునిద్ర!
• ధరల నియంత్రణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం.
• రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే వాటిని నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పర్యవేక్షణా లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని మండిపడ్డారు. ధరల పెరుగుదలతో సామాన్యుడిపై పెను భారం పడుతున్నా పౌరసరఫరాల శాఖ మొద్దు నిద్రలో ఉందంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన.. రేవంత్ రెడ్డి సర్కారు తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. తక్షణమే ధరల పెరుగుదలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి సన్న బియ్యం ధరలు ఎందుకు మండిపోతున్నాయని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే సన్న బియ్యం ధరలు ఏకంగా 25 శాతం పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం నిజంగానే విజయవంతమైతే, బహిరంగ మార్కెట్లో ధరలు ఎందుకు అదుపు తప్పుతున్నాయని ఆయన లాజిక్ తీశారు. సర్కారు ఇస్తున్న నాణ్యత లేని బియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదనడానికి ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పేరిట నామమాత్రపు ధర మాత్రమే దక్కుతోందని, కానీ మధ్య దళారులు మాత్రం క్వింటాకు రూ.8,000 పైనే వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు గిట్టుబాటు ధర లేక, వినియోగదారుడికి అందుబాటు ధర లేక ఇద్దరూ తీవ్రంగా నష్టపోతుంటే.. దళారులు మాత్రం దర్జాగా లాభపడుతున్నారని, కళ్లముందే ఇంత తతంగం జరుగుతున్నా ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం బియ్యం మాత్రమే కాకుండా అన్ని రకాల నిత్యావసరాల ధరలు అడ్డగోలుగా పెరిగి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో కిలో ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లి నూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165 చొప్పున అమ్ముడవుతుంటే సామాన్య కుటుంబం ఎలా బతకాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. ధరల మోతతో వంటింటి బడ్జెట్ తారుమారవుతున్నా పౌరసరఫరాల శాఖ, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే చోద్యం చూడకుండా.. వెంటనే బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక మార్జిన్లపై విస్తృత తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సన్నబియ్యం సహా నిత్యావసరాల ధరలకు అడ్డుకట్ట వేయాలని, సామాన్యులకు భారం నుంచి ఉపశమనం కల్పించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.