అమెరికాతో వాణిజ్య చర్చల్లో పీటముడి!
• రాయితీలు, రాజీ ధోరణి కష్టంగా మారడమే కారణం.
• వాణిజ్య లోటును పూడ్చుకునే పనిలో అగ్రరాజ్యం
సుంకాల విధింపు కాదు.
మ్యూనిక్ భద్రతా సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి.
న్యూఢిల్లీ, మహా.
భారత్, అమెరికా దేశాల మధ్య ఎంతో కాలంగా సాగుతున్న ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) చర్చల్లో దాదాపుగా పీటముడి పడినట్లేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య కొంతకాలంగా జరుగుతున్న ఈ చర్చలు ప్రస్తుతం ఒకరకంగా స్తంభించినట్లుగానే కనిపిస్తున్నాయని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యూనిక్ లీడర్స్ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి.. ఇరు దేశాల వాణిజ్య బంధం, ఒప్పందాల పురోగతిపై తనదైన శైలిలో విశ్లేషించారు. వాణిజ్య ఒప్పందం ముందుకు సాగాలంటే ఉభయ వర్గాలు పరస్పరం రాయితీలు ఇవ్వడం, కొన్ని విషయాల్లో రాజీ పడటం తప్పనిసరని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాలకు ఆ నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టంగా మారిందని ఆమె కుండబద్దలు కొట్టారు. దౌత్యపరంగా చర్చలైతే నిరంతరం జరుగుతున్నాయని, కానీ ఒప్పందం కుదిరేందుకు అవతలి వారికి ఇవ్వాల్సిన మినహాయింపుల విషయంలోనే ఇరు వర్గాలకు ఇబ్బందికరంగా పరిణమించిందని మంత్రి వ్యాఖ్యానించారు. రెండు దేశాలు ఏ మేరకు రాజీ ధోరణి ప్రదర్శిస్తాయన్న దానిపైనే ఈ వాణిజ్య ఒప్పంద భవితవ్యం ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పారు.
అమెరికాతో జరుగుతున్న వాణిజ్యం ఇప్పటికీ పూర్తిస్థాయిలో భారత్‌కే అనుకూలంగా ఉందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ వాణిజ్య లోటు వల్ల ఆర్థికంగా తమకే నష్టం జరుగుతోందని భావిస్తున్న అమెరికా, ఆ లోటును వీలైనంత మేర పూడ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని ఆమె విశ్లేషించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాల కోసం జరిగే చర్చల సరళిలో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని ఆర్థిక మంత్రి వివరించారు. ఎగుమతులు, దిగుమతులపై విధించే సుంకాలు (టారిఫ్‌లు) కూడా ఈ చర్చల్లో ప్రధాన భాగమేనని, ఆ నిబంధనలు ఇంకా ఉన్నప్పటికీ సుంకాల విధింపు ఒక కొత్త పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. వాణిజ్యపరమైన ఎలాంటి సమస్యలు తలెత్తినా, సుంకాల పెంపు వంటి ఏకపక్ష నిర్ణయాల కంటే.. పరస్పర చర్చల ద్వారానే పరిష్కారం కనుక్కోవడం అత్యుత్తమ మార్గమని మంత్రి స్పష్టం చేశారు. వాణిజ్య లావాదేవీల్లో ఇరు దేశాలు సామరస్యపూర్వకంగా ‘ఇచ్చిపుచ్చుకునే’ విధానాలను అన్వేషించాలని ఆమె సూచించారు.
మారుతున్న ప్రపంచ భౌగోళిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, వివిధ దేశాలు బహుపాక్షిక ఒప్పందాల కంటే ద్వైపాక్షిక ఒప్పందాల (బైలేటరల్ అగ్రిమెంట్స్) వైపే అధికంగా మొగ్గు చూపుతున్నాయని నిర్మలా సీతారామన్ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. పలు దేశాలకు ఉమ్మడిగా వర్తించే ఒప్పందాల వల్ల ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చని, కేవలం రెండు దేశాల మధ్య జరిగే ఒప్పందాలే తమకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయని మెజారిటీ దేశాలు బలంగా విశ్వసిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కోణంలోనే ఐరోపా సమాఖ్యతో (ఈయూ) భారత్ కుదుర్చుకోనున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సైతం తాను ఒక ద్వైపాక్షిక ఒప్పందంగానే పరిగణిస్తానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.







