Mahaa Daily Exclusive

  సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీం సీరియస్….

Share

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీం సీరియస్.
• కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ.
• ఫారం-6 సవరణల రికార్డులు సమర్పించాలని ఆదేశం.

న్యూఢిల్లీ,మహా.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఓటర్ల నమోదుకు ఉద్దేశించిన ఫారం-6 సవరణలు, ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో నిబంధనలను పక్కనపెట్టారన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆయా నిర్ణయాలకు సంబంధించిన పూర్తి రికార్డులను తమ ముందు సమర్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలోని ధర్మాసనం ఈసీని ఆదేశించింది.
సీఈసీ ఏకపక్ష నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ హాజరై ధర్మాసనానికి వాదనలు వినిపించారు. నూతన చట్టం (సీఈసీ అండ్ ఈసీస్ యాక్ట్) ప్రకారం ఎన్నికల సంఘంలో ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ప్రాతిపదికన మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ, ప్రస్తుత సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను, అభిప్రాయాలను బుట్టదాఖలు చేసి, ఒంటరిగా నిర్ణయాలు తీసుకుని అమలు చేశారని ఆరోపించారు. చట్టప్రకారం సీఈసీ ఒంటరిగా వ్యవహరించడానికి వీల్లేదని, అందువల్ల ఆయన తీసుకున్న నిర్ణయాలను తక్షణమే రద్దు చేయాలని న్యాయవాది వికాస్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు సావధానంగా విన్న సీజేఐ ధర్మాసనం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈసీ సమర్పించే రికార్డులను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఒకవేళ ఫారం-6లో మార్పులపై కమిషనర్ల మధ్య ఏకాభిప్రాయం, లేదా మెజారిటీ నిర్ణయం లేకుండానే ఏకపక్షంగా ముందుకు వెళ్లినట్లు నిర్ధారణ అయితే, ఆ సవరణలను పక్కనపెట్టే అవకాశం ఉంటుందని కూడా ధర్మాసనం స్పష్టం చేయడం గమనార్హం.