ప్రత్యర్థి హద్దు మీరితేనే యుద్ధం!
• రాయలసీమ అభివృద్ధి వేదికపై రాజకీయాలు వద్దు.
• గత ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు.
• ప్రొద్దుటూరు సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
కడప,మహా.
రాయలసీమ అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సభల్లో రాజకీయాలు మాట్లాడటం సరికాదని, ప్రత్యర్థి హద్దు మీరినప్పుడే యుద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన ‘జల్ జీవన్ మిషన్’, ‘అమరజీవి జలధార’ తదితర పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. సభలో కార్యకర్తల ఉత్సాహాన్ని, ఆవేశాన్ని గమనించిన ఆయన.. వారి భాోద్వేగాలు తనకు అర్థమవుతున్నాయని, అయితే ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదని సున్నితంగా వారించారు. అవతలి వారు హద్దు మీరినప్పుడే మనం యుద్ధం చేయాల్సి ఉంటుందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
గత వైసీపీ ఐదేళ్ల పాలనపై పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని, కనీసం కేంద్రం ఇచ్చిన నిధులను సైతం సద్వినియోగం చేసుకోకుండా పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జల్ జీవన్ మిషన్ పథకాన్ని మళ్లీ పొడిగించుకున్నామని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. దీనికి నిదర్శనంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఏకంగా రూ.6 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.








