సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలి.
* బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు!
* ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)ను రద్దు చేయాల్సిందే.
* కేంద్రంపై మూడు కీలక డిమాండ్లు ఉంచిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.
న్యూఢిల్లీ, మహా.
దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ లక్ష్యంగా విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు కీలక డిమాండ్లను తెరపైకి తెచ్చారు. వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఎన్నికల సంఘం ఏకపక్షంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేశారు. వీటికి తోడు భవిష్యత్తులో దేశంలో జరిగే అన్ని ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా కేవలం బ్యాలెట్ పేపర్ల ద్వారానే పారదర్శకంగా నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్‌ను ఆయన ప్రభుత్వం ముందుంచారు.
ఈ మూడు డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ‘ఇండియా’ (INDIA) కూటమి భాగస్వామ్య పక్షాలు రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో పోరాడుతున్నాయని ఖర్గే తెలిపారు. ఈ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలుపంచుకుంటున్న పౌర సమాజ సభ్యులకు, యువజన సంఘాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల సందర్భంగా కొందరు మహిళా జర్నలిస్టులపై జరిగిన వేధింపులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను చూసి దేశంలోని నిరంకుశ పాలకులు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారని ఖర్గే విమర్శించారు.
మరోవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సైతం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, సీఈసీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలో ప్రారంభమైన ఈ ‘ఎస్ఐఆర్’ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను రాజకీయ దుమారంగా మారిందని, ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అవినీతికి, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం తీవ్రమవుతోందని ఆయన అన్నారు. వాడవాడలా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి బలంగా వినిపిస్తోందని నారాయణ తెలిపారు. ఒకవైపు ఓట్ల చోరీకి పాల్పడుతున్న పాలకులే.. మరోవైపు యూపీఐ లావాదేవీల పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ సామాన్యుల జేబుల చోరీకి సైతం తెగబడ్డారని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో తలెత్తిన ఓ వివాదంలో విద్యాశాఖ మంత్రి రాజీనామాతో ప్రధాని నరేంద్ర మోదీ గండం నుంచి తృటిలో బయటపడ్డారని, అయితే ఇప్పుడు ఈ సీఈసీ వ్యవహారం మాత్రం నేరుగా ప్రధాని మోదీ మెడకే ఉచ్చులా చుట్టుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని నారాయణ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.







