Mahaa Daily Exclusive

  శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత!

Share

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత!
* రూ.1.20 కోట్ల విలువైన 800 గ్రాముల పసిడి స్వాధీనం.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్‌ శివార్లలోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి పసిడిని అక్రమంగా తరలించేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడి ఆటకట్టించారు. అతడి వద్ద నుంచి కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులకు అప్పగించారు.
సోమవారం ఉదయం తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ఓ ప్రయాణికుడు విమానంలో హైదరాబాద్ చేరుకున్నాడు. విమానాశ్రయం వెలుపలికి వస్తున్న అతడి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు.. వెంటనే అడ్డుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతడి వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారం ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి సుమారు 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. పట్టుబడిన ఈ బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు.. ఈ బంగారాన్ని ఎవరి కోసం, ఎక్కడికి తీసుకువస్తున్నారనే కోణంలో లోతుగా విచారిస్తున్నారు.