Mahaa Daily Exclusive

  సామాన్యుడికి మళ్లీ ఈఎంఐల సెగ!

Share

సామాన్యుడికి మళ్లీ ఈఎంఐల సెగ!
• పావు శాతం వడ్డీ రేటును పెంచనున్న ఆర్బీఐ.
• 5.50 శాతానికి చేరనున్న రెపో రేటు..
ముంబై, మహా.
సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారితో పాటు, వాహన, ఇతర రుణాలు తీసుకున్న సామాన్యులపై మళ్లీ ఈఎంఐల భారం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాల్లో వడ్డీ రేట్ల సవరణపై కీలక నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతమున్న 5.25 శాతం రెపో రేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచి 5.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థికవేత్తలు, బ్యాంకర్ల సర్వేలో వెల్లడైంది. ఏడో తేదీన ఎంపీసీ సమావేశాల ముగింపు అనంతరం ఆర్బీఐ గవర్నర్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు నానాటికీ పెరుగుతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పైకి ఎగబాకుతుండటం ఆర్బీఐ తాజా నిర్ణయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కూడా అదే బాటలో పయనించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి 2023 ఫిబ్రవరిలో ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును పావు శాతం పెంచి 6.50 శాతానికి చేర్చింది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు కాస్త కుదుటపడటంతో 2025 సంవత్సరం నుంచి దశలవారీగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ రావడం వల్ల ప్రస్తుతం అది 5.25 శాతానికి దిగివచ్చింది. అయితే, ప్రస్తుత భౌగోళిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మళ్లీ వడ్డింపుల పర్వానికి ఆర్బీఐ తెరతీయనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ప్రతికూలంగా కొనసాగితే డిసెంబర్‌లో జరిగే తదుపరి ఎంపీసీ సమావేశంలోనూ మరో 25 బేసిస్ పాయింట్ల మేర పెంపు ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
మార్కెట్ వర్గాల అంచనాల మేరకు ఆర్బీఐ రెపో రేటును పావు శాతం పెంచితే మాత్రం ఆ ప్రభావం నేరుగా సామాన్యుల జేబులపై పడనుంది. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులు సైతం తమ రుణాలపై వడ్డీ రేట్లను సవరిస్తాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే ఫ్లోటింగ్ రేట్ల విధానంలో రుణాలు తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తున్న వారి నెలవారీ వాయిదాల భారం అమాంతం పెరగనుంది. అలాగే కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి సైతం అధిక వడ్డీల సెగ తప్పదు. పండుగల సీజన్‌లో గృహ, వాహన విక్రయాలు ఊపందుకునే సమయంలో వడ్డీ రేట్లు పెరిగితే అది కొనుగోళ్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.