వెయ్యి రోజులైనా అమలుకాని ఆరు గ్యారెంటీలు!
• గురుకులాల నిర్వహణ పూర్తిగా గాడితప్పాయి.
• కల్యాణలక్ష్మి సాయం కోసం రెండు లక్షల మంది నిరీక్షణ.
• కాంగ్రెస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, మహా.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి సర్కారు.. మూడేళ్లవుతున్నా ప్రజలను మోసం చేస్తూనే ఉందని ఆయన మండిపడ్డారు. ఆదివారం గజ్వేల్‌లో తెలంగాణ తురక కాశ సంక్షేమానికి చేయూత కార్యక్రమంలో భాగంగా 90 మంది కాశ కార్మికులకు స్టోన్ కటింగ్ మిషన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు.
మైనారిటీలకు ప్రతి ఏటా రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని హరీశ్‌రావు నిలదీశారు. బీఆర్‌ఎస్ హయాంలో మైనారిటీల సంక్షేమం కోసం రూ.1,800 కోట్ల వరకు ఖర్చు చేశామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నిధుల కేటాయింపులు, ఖర్చులు దారుణంగా తగ్గిపోయాయని విమర్శించారు. మైనారిటీ గురుకులాల నిర్వహణ పూర్తిగా గాడితప్పిందని, సరైన సదుపాయాలు లేక విద్యార్థుల సంఖ్య నానాటికీ పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్న మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు సకాలంలో ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. మైనారిటీ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ ఉద్యోగులకు నెలలు, ఏళ్ల తరబడి జీతాలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును అత్యంత అద్భుతంగా నిర్మించామని, కన్నెపల్లి నుంచి నీళ్లు విడుదల చేసి ఉంటే మల్లన్నసాగర్‌కు నీరు పుష్కలంగా వచ్చేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయకపోవడం వల్లే మల్లన్నసాగర్‌కు సాగునీరు అందడం లేదని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా గజ్వేల్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు తాము ఎంతో కృషి చేశామని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ కాంగ్రెస్ నేతలు పదేపదే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ పనుల్లో కేవలం ఐదు శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే కోర్టు కేసులను పరిష్కరించి మిగిలిన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలను సత్వరమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు.
కల్యాణలక్ష్మి పథకం ఎన్నికల హామీ కాకపోయినప్పటికీ, పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించాలనే సదుద్దేశంతో కేసీఆర్ ఆ పథకానికి శ్రీకారం చుట్టారని హరీశ్‌రావు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఏటా రెండున్నర లక్షల మందికి పైగా ఆడపిల్లల వివాహాలకు రూ.2,600 కోట్ల చొప్పున వెచ్చించామన్నారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో కల్యాణలక్ష్మి చెక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది పేదలు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు చేసుకున్న పేద కుటుంబాలకు తక్షణమే ఆ బకాయిలను చెల్లించాలని పట్టుబట్టారు. మరోవైపు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలతో మునుపెన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి జరిగిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ గత మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇక్కడ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. కొత్తగా ఒక్క అభివృద్ధి పనీ జరగలేదని, గజ్వేల్‌లో ఎటు చూసినా ‘ఇళ్లు, దుకాణాలు అద్దెకు’ అనే బోర్డులే దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల కళ్లకు కనిపించే అభివృద్ధినే వారు ఆదరిస్తారని, కేవలం మాయమాటలు చెబితే ప్రయోజనం శూన్యమని హితవు పలికారు. గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ చేసిన విశేష కృషిని ప్రజలు ఎప్పటికీ మరువరని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం అండగా పోరాడుతుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.








