ఒంటరి శక్తిగా అగ్రరాజ్యం అమెరికా!
* ఉద్దేశపూర్వకంగానే ఆ దిశగా అడుగులు.
*మ్యూనిక్ భద్రతా సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ, మహా.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ వేదికపై తన పాత్రను క్రమంగా తగ్గించుకుంటూ ‘ఒంటరి శక్తి’ (లోన్లియర్ పవర్)గా మారుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యూనిక్ లీడర్స్ మీటింగ్లో (మ్యూనిక్ భద్రతా సదస్సు) ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ పరిణామాల్లో అమెరికా తన భాగస్వామ్యాన్ని, పాత్రను పునఃపరిశీలించుకుంటోందని, ఇది ఏదో అకస్మాత్తుగా జరుగుతున్న పరిణామం కాదని ఆయన స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే అమెరికా ఆ దిశగా అడుగులు వేస్తోందని, తన విదేశాంగ వైఖరిలో ఉద్దేశపూర్వకమైన మార్పులు చేసుకుంటోందని ఆయన విశ్లేషించారు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రభావితం చేస్తున్న మరో ప్రధాన అంశం డ్రాగన్ కంట్రీ చైనా అనూహ్య ఎదుగుదల అని జైశంకర్ పేర్కొన్నారు. ప్రపంచ తయారీ రంగంలో ఏకంగా మూడో వంతు వాటాను చైనా కైవసం చేసుకోవడం ఆ దేశ ఆర్థిక, పారిశ్రామిక సామర్థ్యానికి ప్రబల నిదర్శనమని అన్నారు. ఈ క్రమంలోనే అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుందని, అయితే ఇది కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై ఏ దేశానికైనా ఉన్న పరపతిని, ప్రభావాన్ని ఒక ఆయుధంగా వాడుకునే ప్రమాదకర స్థాయికి అగ్రరాజ్యాల మధ్య పోటీ చేరిందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు అభివృద్ధి చెందుతున్న, మధ్య స్థాయి దేశాల దౌత్య వ్యూహాల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోందని విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఆయా దేశాలు తమ జాతీయ ప్రయోజనాల సాధన కోసం ఒకే దేశంపై లేదా ఒకే కూటమిపై ఆధారపడే పాత విధానానికి స్వస్తి పలుకుతున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాలతో ‘బహుళ భాగస్వామ్యాల’ (మల్టీ అలైన్మెంట్) విధానాన్ని ఎంచుకుంటున్నాయని వివరించారు. ప్రతి దౌత్య అంశంలోనూ అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదని, నిర్దిష్ట ప్రయోజనాల ప్రాతిపదికన మాత్రమే ఆయా దేశాలు కలిసి పనిచేసే వినూత్న ధోరణి పెరుగుతోందని స్పష్టం చేశారు. ఇక ఐక్యరాజ్యసమితి వంటి బహుపాక్షిక సంస్థలు ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా సంస్థల పనితీరులో తీవ్రమైన స్తబ్ధత నెలకొనడం వల్లే, ప్రపంచ దేశాలు తమ ప్రయోజనాల సాధన కోసం చిన్న చిన్న కూటములుగా ఏర్పడటానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని జైశంకర్ కుండబద్దలు కొట్టారు.








