Mahaa Daily Exclusive

  నివృత్తి డీ-అడిక్షన్ కేంద్రాలకు ఎస్కోచ్ అవార్డు….

Share

  • నివృత్తి డీ-అడిక్షన్ కేంద్రాలకు ఎస్కోచ్ అవార్డు
  • తెలంగాణ జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమానికి జాతీయ గుర్తింపు

కుషాయిగూడ, మహా : తెలంగాణ జైళ్లు, కరెక్షనల్‌ సర్వీసెస్‌ శాఖ చేపట్టిన ‘నివృత్తి’ డీ-అడిక్షన్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిష్ఠాత్మక ఎస్కోచ్‌ అవార్డు–2026 లభించింది. న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్‌ సెంటర్‌లో నిర్వహించిన 109వ ఎస్కోచ్‌ సమ్మిట్‌–ఇండియా ఎకనామిక్‌ ఫోరంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఖైదీల్లో మాదకద్రవ్యాల వినియోగ సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన పునరావాస ఆధారిత విధానాన్ని గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు.

తెలంగాణ జైళ్లు, కరెక్షనల్‌ సర్వీసెస్‌ డీజీ డా. సౌమ్య మిశ్రా ఐపీఎస్‌ ఈ అవార్డును స్వీకరించారు. కార్యక్రమంలో ఎస్కోచ్‌ లా ఆఫీసెస్‌ వ్యవస్థాపకుడు రోహన్‌ కొచర్‌, ఎస్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచర్‌, జైళ్ల శాఖ డీఐజీ ఎం. సంపత్‌ పాల్గొన్నారు.

4,200 మందికి స్క్రీనింగ్‌

‘డ్రగ్‌-ఫ్రీ తెలంగాణ’ లక్ష్యానికి అనుగుణంగా నివృత్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మాదకద్రవ్య డిమాండ్‌ తగ్గింపు జాతీయ కార్యాచరణ ప్రణాళిక సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగా 4,200 మంది ఖైదీలను మాదకద్రవ్య వినియోగ సమస్యల కోసం స్క్రీనింగ్‌ చేయగా.. 2,126 మందికి డబ్ల్యూహెచ్‌ఓ–అసిస్ట్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి కౌన్సెలింగ్‌, చికిత్స అందించారు. విడుదలైన 300 మంది ఖైదీలకు అనంతరం కూడా అవసరమైన సహాయాన్ని అందించారు.

ఐదు జైళ్లలో కేంద్రాలు

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలను హైదరాబాద్‌ చంచల్‌గూడ కేంద్ర కారాగారం, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్‌ కేంద్ర కారాగారాలతో పాటు హైదరాబాద్‌లోని మహిళా ప్రత్యేక కారాగారంలో ఏర్పాటు చేశారు. మాదకద్రవ్య వినియోగ సమస్యలను గుర్తించడం, స్క్రీనింగ్‌, కౌన్సెలింగ్‌, చికిత్స, పునరావాసం, విడుదల అనంతరం సమాజంలో పునరేకీకరణకు సహకారం అందించడం వంటి సేవలను కేంద్రాలు అందిస్తున్నాయి.

అంతర్జాతీయ వేదికపైనా గుర్తింపు

నివృత్తి కార్యక్రమం ప్రభావాన్ని ఏపీసీఏ, వెల్లూరు నిర్వహించిన అధ్యయనం ద్వారా అంచనా వేశారు. అధ్యయన ఫలితాలను న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ కరెక్షన్స్‌ పరిశోధన సదస్సు–2026లో ప్రదర్శించారు. దీంతో తెలంగాణ జైళ్ల శాఖ పునరావాస విధానానికి అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది.

అవార్డు రావడం జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి గుర్తింపుగా డీజీ డా. సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. ఖైదీలు వ్యసనాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందేందుకు నివృత్తి కార్యక్రమం దోహదపడుతోందన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆఫ్టర్‌కేర్‌, సామాజిక పునరేకీకరణ కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.

‘కస్టడీ విత్‌ కేర్‌’, ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ లైవ్స్‌’ అనే శాఖ దృక్పథానికి అనుగుణంగా మానవీయ, శాస్త్రీయ ఆధారిత పునరావాస విధానాలను బలోపేతం చేయడంలో ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచిందని శాఖ తెలిపింది.