Mahaa Daily Exclusive

  పీఆర్సీని దసరాలోపు ప్రకటించాలి….

Share

  • పీఆర్సీని దసరాలోపు ప్రకటించాలి
  • డీఏల ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి: జి. దేవీ ప్రసాద్

కుషాయిగూడ, మహా : ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ జి. దేవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30తో పీఆర్సీ గడువు ముగియనున్నందున దసరాలోపు కొత్త పీఆర్సీని ప్రకటించాలని కోరారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం రెండు డీఏలు మాత్రమే ఇస్తామని ప్రకటించిందని, మిగిలిన డీఏలు ఎప్పుడు ఇస్తారనే దానిపై స్పష్టత లేదన్నారు. డీఏలకు సంబంధించిన ఉత్తర్వులను తక్షణమే జారీ చేయాలని కోరారు. పీఆర్సీ గడువును ప్రభుత్వం పొడిగిస్తే ఉద్యోగులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.

సీపీఎస్‌పై హామీ అమలు చేయాలి

సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేయొద్దని అన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

ఆరోగ్య కార్డులతో ఇబ్బందులు

ఉద్యోగుల ఆరోగ్య కార్డులను పలు ఆసుపత్రులు పరిగణనలోకి తీసుకోవడం లేదని దేవీ ప్రసాద్‌ తెలిపారు. వెల్‌నెస్‌ సెంటర్లకు ఓపీ సేవలు అప్పగించినా అవసరమైన సిబ్బంది, మందులు, రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రయోగశాలలు ఏర్పాటు చేయలేదన్నారు. ఓపీ సేవలను కేవలం నిమ్స్‌కే పరిమితం చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

డీఏలు, టీఏలు, సరెండర్‌ లీవ్‌ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రాన్‌ ఖాతాల్లోని సుమారు రూ.10 వేల కోట్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు కొత్తగా ఏమీ కోరడం లేదని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నారని తెలిపారు.

సమావేశంలో ఎస్టీఎఫ్‌ మాజీ అధ్యక్షుడు భుజంగరావు, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్‌ పాల్గొన్నారు.