Mahaa Daily Exclusive

  ప్రపంచ పటంలో రాష్ట్ర పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి 

Share

  • ఎఐ, డిజిటల్ టెక్నాలజీతో టూరిజం రంగానికి కొత్త ఊపు
  • ‎‎పీపీపీ విధానంలో మౌలిక వసతులు, పెట్టుబడుల ప్రోత్సాహం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ‎‎శిల్పారామంలోని సాంప్రదాయ వేదికలో ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 వేడుకలు

‎‎హైదరాబాద్, మహా : రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లను విస్తృతంగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రకృతి, చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదకు నిలయమైన తెలంగాణను ప్రపంచ పర్యాటక పటంలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ‎“డిజిటల్ అజెండా – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పర్యాటక రంగానికి కొత్త రూపు” అనే ఇతివృత్తంతో ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 వేడుకలు శనివారం శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో  ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.

‎ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఈ ఏడాది పర్యాటక దినోత్సవ ఇతివృత్తమైన “డిజిటల్ అజెండా – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పర్యాటక రంగానికి కొత్త రూపు”  ప్రాధాన్యతను వివరిస్తూ, ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మన పర్యాటక రంగాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పర్యాటకాన్ని గ్లోబల్ వేదికపై ఆవిష్కరించే నూతన వెబ్‌సైట్‌ను, అద్భుత చిత్రాలతో రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ‎రాష్ట్రంలో హెల్త్, ఆలయ, గ్రామీణ, ప్రకృతి పర్యాటక రంగాలకు అపారమైన అవకాశాలున్నాయని భట్టి తెలిపారు. వికారాబాద్‌లో వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. టైగర్ రిజర్వులు, అడవులు, జలపాతాలు, ప్రాచీన ఆలయాలు, నగరంలోని చారిత్రక కట్టడాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని, ప్రశాంతతను కోరుకునే వారికి తెలంగాణ సరైన వేదిక అని పేర్కొన్నారు. వీటిని అంతర్జాతీయంగా సరైన రీతిలో మార్కెటింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ‎గతంతో పోలిస్తే ఈసారి పర్యాటక రంగానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. సందర్శకుల భద్రత, నాణ్యమైన వసతులకు తమ పాలసీలో పెద్దపీట వేసినట్లు చెప్పారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి, భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని స్పష్టం చేశారు.

‎వారంలో ఐదు రోజులు తీవ్ర ఒత్తిడితో పనిచేసే హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను పర్యాటకం వైపు మళ్లించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇందుకోసం పర్యాటక శాఖ మంత్రి, కార్యదర్శి కలిసి ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలు, పర్యాటక ప్రాజెక్టుల నిర్వాహకులతో త్వరలోనే సమావేశం కావాలని ఆదేశించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ‘టూరిజం కూపన్లు’ అందించి వారాంతాల్లో తెలంగాణలోని ప్రకృతి ప్రాంతాలను సందర్శించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. పర్యాటకం అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి అద్దం పడుతుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. పర్యాటక శాఖ చేపడుతున్న నూతన కార్యక్రమాలను అభినందిస్తూ, తెలంగాణ పర్యాటక కీర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షించారు.

‎తెలంగాణ పర్యాటక శాఖకు సంబంధించిన పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

‎పునర్ ‌రూపకల్పన  (రీడిజైన్) చేసిన తెలంగాణ టూరిజం వెబ్‌సైట్, ఆన్‌లైన్ హోమ్‌స్టే రిజిస్ట్రేషన్ విధానం, కొత్త టూరిజం ట్రైలర్లు, ఇంటరాక్టివ్ ఆధారిత లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై కాఫీ టేబుల్ బుక్, అంశంపై వీడియో/పోస్టర్, ఎకో టూరిజంపై వీడియోను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ‎ఆవిష్కరించారు.

‎ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ నిఖిల్ దాస్, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ పురావస్తు శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ‎

‎“ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీ – ది ఫ్యూచర్ ఆఫ్ టూరిజం”, ఎకో టూరిజం, ఫిల్మ్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం, హెరిటేజ్ టూరిజం తదితర రంగాల్లో వస్తున్న మార్పులు, అవకాశాలపై అంశంపై ప్యానెల్ చర్చ జరిగింది. ఈ సదస్సులో యువ టూరిజం క్లబ్‌ల విద్యార్థులు, టూరిస్ట్ పోలీస్, తెలంగాణ దర్శిని,  శిక్షణ పొందిన గైడ్స్ ,  హోమ్‌స్టే పై పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. తర్వాత ఎక్సలెన్స్ అవార్డులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ‎‎ఈ వేడుకల్లో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, టీజీఏ డైరెక్టర్ లక్ష్మి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, సాహిత్య అకాడమీ సెక్రటరీ బాలాచారి, సినీ నటులు తిరువరూర్, ఫరియా అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.