Mahaa Daily Exclusive

  ఏజన్సీలో ఆధ్వానంగా రహదారులు..! అంబులెన్స్ రాలేనిస్ధితిలో గ్రామాలు.. రహదారులను పరిశీలించిన గిరిజన సంఘం..!

Share

కారేపల్లి, మహ : ఏజెన్సీలో ప్రజాసమస్యలు ప్రభుత్వాలకు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు, తెలంగాణ గిరిజన సంఘం మండల అధ్యక్షులు అజ్మీర శోబన్ నాయక్ లు విమర్శించారు. శనివారం కారేపల్లి మండలంలోని చీమలపాడు, రేలకాయలపల్లి, బాజుమల్లాయిగూడెం ప్రాంతాలలో రహదారులను గిరిజన సంఘం నాయకులు పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చీమలపాడు నుండి లక్ష్మీపురం, పాత తడకలపూడి వరకు రోడ్డు పై ప్రయాణం నరకాన్ని తలపిస్తుందన్నారు. అత్యవసర పరిస్ధితిలో అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి నెలకొందన్నారు. ఈ రోడ్డు నుండే ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్ హాస్టల్ వెళ్లాల్సి ఉంటుందన్నారు. జైత్రంతండా గ్రామపంచాయతీ లో రోడ్డు మొత్తం పగిలిపోయి, నీరు బయటికి పోక చెరువును తలపిస్తుందన్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు అక్కడే నిలిచిపోయి దోమలు, కీటకాలు, పాములు చేరుతున్నాయని తెలిపారు. ప్రజలు రోగాల బారిన పడుతున్న పాలకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీమలపాడు – లక్ష్మీపురం పాత తడకలపూడి రోడ్డును వెంటనే పూర్తి స్థాయిలో నిర్మించాలని, జైత్రం తండా గ్రామపంచాయతీలో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఏకలవ్య మోడల్ స్కూల్ హాస్టల్ కు ప్రత్యేక రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు. ఏజెన్సీ ప్రజల రవాణా సౌకర్యం పెంచి, ఈ ప్రాంతవాసుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏజన్సీ గ్రామాల సమస్యలపై గిరిజన సంఘం ఆధ్వర్యంలో అందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూడు చిన్, తిప్పల కృష్ణ, మొలకం రమేష్, ఆవుల వెంకటేష్, తిప్పల రణదేవ్ తదితరులు పాల్గొన్నారు.