- ఏవియేషన్ హబ్గా కర్నూలు..
- రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం
- కర్నూలును ఏవియేషన్, డ్రోన్, పారిశ్రామిక రంగాల కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం
- ఎఫ్టీఓల సంఖ్యను పెంచి యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు
- నైట్ ల్యాండింగ్పై చర్యలు
- కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు
కర్నూలు, మహా : ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే కీలక ఏవియేషన్ హబ్గా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లాను ఏవియేషన్, డ్రోన్, పారిశ్రామిక రంగాలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలును దేశంలోని బలమైన ఏవియేషన్ హబ్లలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్నూలు ఎయిర్పోర్టులో శనివారం ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ (ఎఫ్టీఓ)ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్టీఓ) కర్నూలులో ఏర్పాటు కావడం ప్రత్యేక పరిణామమన్నారు. కేవలం విమానాశ్రయాల నిర్మాణానికే పరిమితం కాకుండా శిక్షణ, విమానాల నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, ఎయిర్పోర్టు మేనేజ్మెంట్ తదితర విభాగాలతో సమగ్ర ఏవియేషన్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా ప్రస్తుతం సుమారు 166 విమానాశ్రయాలకు చేరుకున్నాయని మంత్రి తెలిపారు. విమానాశ్రయాలతో పాటు విమానాలు, ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. విస్తరిస్తున్న విమానయాన రంగానికి అవసరమైన మానవ వనరులను సిద్ధం చేయడంలో ఎఫ్టీఓల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుతం దేశంలో సుమారు 36 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు ఉన్నాయని, భవిష్యత్ అవసరాలకు ఈ సంఖ్య సరిపోదన్నారు. దేశంలో విమానాల ఆర్డర్లు సుమారు 1,600కు చేరుకున్న నేపథ్యంలో రానున్న 10–15 ఏళ్లలో 25 వేల నుంచి 30 వేల మంది పైలట్లు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. యువతకు దేశంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో పైలట్ శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్టీఓలను విస్తరిస్తోందని చెప్పారు.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సమీపంలో ఉండటం, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానాశ్రయం అందుబాటులో ఉండటం కర్నూలుకు ప్రత్యేక ప్రయోజనమని మంత్రి పేర్కొన్నారు. ఏడాది పొడవునా అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటం పైలట్ శిక్షణకు అనువుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం కర్నూలు ఎఫ్టీఓలో మూడు శిక్షణ విమానాలు ఉన్నాయని, వీటి సంఖ్యను త్వరలో 10కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎఫ్టీఓ ద్వారా ఏడాదికి 60 మంది వరకు శిక్షణ పొందే సామర్థ్యం ఏర్పడుతుందన్నారు. విమానాల నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, ఎయిర్పోర్టు మేనేజ్మెంట్ తదితర రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
డ్రోన్ సిటీకి ప్రత్యేక ప్రాధాన్యం
కర్నూలులో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం రక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, శాంతిభద్రతలు, భూ సర్వేలు, గ్రౌండ్ సర్వైలెన్స్ తదితర రంగాల్లో మరింత విస్తరించనుందని తెలిపారు. డ్రోన్ల నాణ్యతా పరీక్షలు, ధ్రువీకరణ వంటి కార్యకలాపాలను కర్నూలులోనే నిర్వహించేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. విమానయాన, డ్రోన్ కార్యకలాపాలను ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయకుండా ప్రాంతీయంగా వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల 11 ఎఫ్టీఓలకు అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. కర్నూలులో మరో ఎఫ్టీఓతో పాటు కడపలో రెండు ఎఫ్టీఓలకు అనుమతులు ఇచ్చామని, రాజమండ్రిలోనూ ఎఫ్టీఓలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భోగాపురం కూడా ఎఫ్టీఓలకు అనుకూల ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
కర్నూలు, కడప తదితర ప్రాంతాల్లో ఎఫ్టీఓలు ఏర్పాటవడంతో రాష్ట్రంలో క్లస్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శిక్షణ విమానాలు, పైలట్లు, ట్రైనర్ల అనుభవాలను పరస్పరం పంచుకునే అవకాశం ఏర్పడి శిక్షణ ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు.
ఎఫ్టీఓల నిర్వహణ, శిక్షణ నాణ్యత, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. తొలి ర్యాంకింగ్లో ఒక ఎఫ్టీఓ మాత్రమే ‘ఏ’ గ్రేడ్ సాధించగా, ప్రస్తుతం 13 ఎఫ్టీఓలు ‘ఏ’ గ్రేడ్, ఒక ఎఫ్టీఓ ‘ఏ ప్లస్’ గ్రేడ్ సాధించాయని వివరించారు. కర్నూలులోని ఎఫ్టీఓలు ప్రారంభం నుంచే ఉన్నత ప్రమాణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని సూచించారు.
2047 నాయికి 350కి పైగా విమానాశ్రయాల లక్ష్యం
రాబోయే పదేళ్లలో దేశంలో మరో 100 విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. 2047 నాటికి దేశంలో 350కి పైగా విమానాశ్రయాలు ఉండేలా విమానయాన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, విజయవాడ, కడప, రాజమండ్రి విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్ భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. కుప్పం, నెల్లూరు, శ్రీకాకుళం, అమరావతి, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపైనా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భోగాపురంలో 139 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
కర్నూలు విమానాశ్రయానికి నైట్ ల్యాండింగ్
కర్నూలు విమానాశ్రయంలో విమాన సర్వీసుల సంఖ్య, సమయాలు, కనెక్టివిటీ పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. మరిన్ని విమాన సర్వీసుల కోసం విమానయాన సంస్థలతో చర్చిస్తామని వెల్లడించారు. కర్నూలు విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సదుపాయం కల్పించే అంశంపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని ఎంపీ బస్తీపాటి నాగరాజు ఢిల్లీలో పలుమార్లు తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అవసరమైన చర్యలు చేపట్టి నైట్ ల్యాండింగ్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే విమానాశ్రయ కార్యకలాపాల సమయం పెరిగి, కర్నూలుకు అదనపు విమాన కనెక్టివిటీకి అవకాశం ఏర్పడుతుందని మంత్రి వివరించారు.
హన్సా ఎన్జీపై దృష్టి
దేశీయంగా తయారవుతున్న ‘హన్సా ఎన్జీ’ ఆధునిక ట్రైనర్ విమానాన్ని పైలట్ శిక్షణలో వినియోగించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆధునిక శిక్షణ విమానాలను ఎఫ్టీఓలు, విద్యార్థి పైలట్లు వినియోగించేలా అవసరమైన సహకారం అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. విమానాశ్రయాలు, ఎఫ్టీఓలు, ఏవియేషన్ యూనివర్సిటీలు, డ్రోన్ సిటీ, అనుబంధ పరిశ్రమలను సమన్వయంతో అభివృద్ధి చేయడం ద్వారా కర్నూలును సమగ్ర ఏవియేషన్ ఎకోసిస్టమ్కు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు సాగుతున్నాయని రామ్మోహన్నాయుడు వెల్లడించారు.








