హైదరాబాద్, మహా : తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాగల 48 గంటల పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శనివారం మధ్యాహ్నం రిపోర్ట్ ప్రకారం రాబోయే రెండు రోజులలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడి వర్షాలు పడే సూచనలున్నాయి. సెప్టెంబర్ 27 ఉదయం 8:30 వరకు కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 27 ఉదయం 8:30 నుండి సెప్టెంబర్ 28 ఉదయం 8:30 వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈనెల 28 నుంచి తేలికపాటి వర్షాలే
సెప్టెంబర్ 28 నుంచి రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అక్టోబర్ 3 వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ ఎలాంటి తీవ్రమైన హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 28వ తేదీ నుంచి ఎండల తీవ్రత పెరిగే సూచనలున్నాయి. ఎక్కువగా పొడి వాతవరణ పరిస్థితులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ సీజన్‌కు సంబంధించి నైరుతి రుతుపవనాల ప్రధాన వర్షాలు దాదాపుగా ముగిసినట్లేనని అధికారులు ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2 వరకు తెలంగాణ అంతటా తీవ్రమైన వేడి ఉండే అవకాశాలు ఉంది, చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 34-36 డిగ్రీల వరకు నమోదయ్య అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఆ తర్వాత, తూర్పు గాలుల ప్రభావం (ఈశాన్య రుతుపవనాలకు ముందు వచ్చే వర్షాలు) కారణంగా అక్టోబర్ 3-10 మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.








