Mahaa Daily Exclusive

  ఉపఎన్నికలో అభ్యర్థిని నిలబెడతాం :టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

Share

 

హైదరాబాద్, మహా : ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో తెలంగాణ రక్షణ సేన తరఫున అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానం నాగేందర్‌ అనర్హతతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో ఉపఎన్నికకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు కూడా ఆయన అనర్హతను సమర్థించిన నేపథ్యంలో ఉపఎన్నికపై రాజకీయ పార్టీల్లో కసరత్తు మొదలైంది. దానం నాగేందర్‌ పార్టీ మార్పుపై కవిత స్పందించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. కాగా, నాగేందర్‌ 2023లో బీఆర్‌ఎస్‌ తరఫున ఖైరతాబాద్‌ నుంచి గెలిచి, 2024లో కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ వ్యవహారంలో ఆయనపై అనర్హత వేటు పడింది.

ఓటర్ల జాబితా సవరణపై కూడా కవిత స్పందించారు. క్లరికల్‌ తప్పిదాల కారణంగా ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రోత్సాహంతో కుట్రపూరితంగా ఓట్ల తొలగింపు జరుగుతోందనే చర్చ ప్రజల్లో ఉందని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎన్నికల అధికారులు లేదా బీజేపీ వైపు నుంచి స్పందన ఉంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఖైరతాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఇప్పటికే రాజకీయ పార్టీల మధ్య చర్చ జరుగుతోంది.

రిమ్స్ లో చిన్నారుల మృతి బాధాకరం

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు బాధాకరమని కవిత అన్నారు. తెలంగాణలో విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు సరిగా అందడం లేదని ఆమె ఆరోపించారు. నిమ్స్‌, నీలోఫర్‌ వంటి ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉందని పేర్కొన్నారు. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు పథకాలకు ప్రభుత్వం తగిన బడ్జెట్‌ కేటాయించలేదని, ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా విడుదల చేయలేదని కవిత ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టళ్లను జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. తెలంగాణ రక్షణ సేన తరఫున జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపారు.

నా ఫాంహౌజ్ లో అక్రమ భూమి లేదు

తన ఫామ్‌హౌస్‌కు సంబంధించి వస్తున్న ఆరోపణలను కవిత ఖండించారు. అక్కడ ఎలాంటి అక్రమ భూములు లేవని, ఇనాం, కబ్జా లేదా అసైన్డ్‌ భూమి లేదని చెప్పారు. తన ఫామ్‌హౌస్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో లేదని, ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ద్వారా ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానాలను ప్రస్తావిస్తూ పలు అంశాలపై ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు