Mahaa Daily Exclusive

  వర్షానికి దెబ్బతిన్న చార్మినార్ ఊడిపడిన ప్లాస్టరింగ్

Share

  • లాడ్ బజార్ వైపు ఉన్న మినార్ ప్లాస్టరింగ్ పెచ్చులు ఊడిపడిన వైనం
  • శనివారం వరకు భారీ వర్ష సూచనతో అప్రమత్తమైన అధికారులు

హైదరాబాద్, మహా : భాగ్యనగరంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో చారిత్రక కట్టడం చార్మినార్ స్వల్పంగా దెబ్బతింది. మంగళవారం రాత్రి పాతబస్తీలో సుమారు అరగంట పాటు కురిసిన కుండపోత వానకు లాడ్ బజార్ వైపు ఉన్న మినార్ ప్లాస్టరింగ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న చార్మినార్ భద్రతా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కిందపడిన ప్లాస్టరింగ్ శకలాలను తొలగించారు. మంగళవారం సాయంత్రం నగరంలో 37.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ వర్షం కారణంగానే మినార్ ప్లాస్టరింగ్ ఊడిపడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అధికారులు స్పందించారు. ఎడమవైపు మినార్ కింద ఉన్న గోడ వెలుపలి భాగం కొంత బలహీనపడటంతో భారీ వర్షానికి ప్లాస్టరింగ్ రాలిపోయిందని వారు తెలిపారు. దెబ్బతిన్న భాగానికి మరమ్మతులు నిర్వహించేందుకు ఇప్పటికే టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల్లో అత్యధికంగా సంగారెడ్డిలో 82.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు, ఈ నెల 26వ తేదీ శనివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చార్మినార్‌తో పాటు ఇతర చారిత్రక కట్టడాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు నిర్ణయించారు.