Mahaa Daily Exclusive

  28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత రాష్ట్రాలకు కొత్త ఇంచార్జ్‌లను నియమించిన బీజేపీ

Share

  • ఏపీ బీజేపీ ఇంచార్జ్‌గా అర్వింద్ భదౌరియా
  • తెలంగాణ ఇంచార్జ్‌గా సునీల్ భన్సల్
  • ఒడిశా ఇంచార్జ్‌గా పురందేశ్వరి
  • తెలంగాణకు చెందిన ఎంపీ డీకే అరుణ, కాసం వెంకటేశ్వర్లు సహ ఇంచార్జీలుగా నియామకం

న్యూఢిల్లీ, మహా : రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో విజయమే ఏకైక లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని భారీగా ప్రక్షాళన చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇంచార్జ్‌లు, సహ-ఇంచార్జ్‌ల జాబితాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధికారికంగా ప్రకటించారు. ప్రాంతీయ రాజకీయ సమీకరణలు, ఎన్నికల వ్యూహాలను ప్రామాణికంగా తీసుకుని కీలక నేతలకు ఈ బాధ్యతలు కట్టబెట్టారు.

తెలంగాణకు సునీల్ భన్సల్‌ ఇంచార్జ్‌గా వ్యవహరించనుండగా, అభయ్ పాటిల్, రేఖా శర్మ సహ-ఇంచార్జ్‌లుగా నియమితులయ్యారు. (సునీల్ భన్సల్ పశ్చిమ బెంగాల్ ఇంచార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు). ఆంధ్రప్రదేశ్ కు అర్వింద్ భదౌరియా ఇంచార్జ్‌గా, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ సహ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారు. తమిళనాడుకు రామ్ మాధవ్ ఇంచార్జ్‌గా ఎంపికవ్వగా, కో-ఇంచార్జ్‌లుగా డీకే అరుణ, నిర్మల్ కుమార్ సురాణా బాధ్యతలు చేపట్టనున్నారు. ఒడిశాకు దగ్గుబాటి పురందేశ్వరి ఇంచార్జ్‌గా, డాక్టర్ స్వదేశ్ సింగ్ సహఇంచార్జ్‌గా నియమితులయ్యారు. కర్ణాటకకు హరీశ్ ద్వివేది ఇంచార్జ్‌గా తెలంగాణకు చెందిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు సహఇంచార్జ్‌గా ఎంపికయ్యారు. దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న యూపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఇంచార్జ్‌గా ఎంపికయ్యారు. ఆయనకు తోడుగా నలుగురు సహ-ఇంచార్జ్‌లను కేటాయించారు. మహారాష్ట్రకు బైజయంత్ జయ్ పాండా ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారు. ఆయనకు సహాయంగా అమిత్ మాలవీయ, సదానంద్ షెట్ తనవాడే, కమల్‌జీత్ సెహ్రావత్‌లను సహ ఇంచార్జ్‌లుగా నియమించారు. ఛత్తీస్‌గఢ్, హర్యానాలకు మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఈ రెండు రాష్ట్రాల ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఢిల్లీకి డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే ఇంచార్జ్‌గా, జాంయాంగ్ త్సేరింగ్ నామ్‌గ్యాల్, దర్శనాబెన్ జర్దోష్‌లను కోఇంచార్జ్‌లుగా నియమించారు. గుజరాత్ కు తరుణ్ చుగ్ ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టనున్నారు. హిమాచల్ ప్రదేశ్ కు శ్రీకాంత్ శర్మ ఇంచార్జ్‌గా వ్యవహరించనున్నారు. మధ్యప్రదేశ్ కు మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ ఇంచార్జ్‌గా నియమితులయ్యారు.