• కొలీజియం సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర.
• ఉత్తర్వులు జారీ చేసిన న్యాయశాఖ.
న్యూఢిల్లీ, మహా.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా సేవలందిస్తున్న ఐదుగురికి శాశ్వత న్యాయమూర్తులుగా (పర్మినెంట్ జడ్జిలుగా) పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు అదనపు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ తోట చంద్ర ధన శేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాధ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులు ఇకపై ఏపీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులుగా కొనసాగనున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సమావేశంలో వీరి పేర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేయగా, కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. వీరిలో జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ తోట చంద్రధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్లు 2024 అక్టోబర్ 28వ తేదీన అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించగా.. జస్టిస్ అవధానం హరిహరనాధ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులు 2025 జనవరి 24న అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా వీరందరికీ శాశ్వత హోదా దక్కడంతో ఏపీ హైకోర్టు న్యాయవ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఐదుగురు న్యాయమూర్తులకు శాశ్వత హోదా లభించడం పట్ల హైకోర్టు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.







