Mahaa Daily Exclusive

  తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు

Share

  • 3.64 శాతం, 2.74 శాతానికి అంగీకారం
  • సీఎస్ తో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నేతలు
  • క్యాబినెట్ ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన

హైదరాబాద్, మహా : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ కరువు భత్యం (డీఏల) విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ వాయిదాల్లో రెండు డీఏలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సెక్రటేరియట్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. రెండు డీఏల్లో ఒకటి 3.64 శాతం, మరొకటి 2.74 శాతం చొప్పున ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తుది అధికారిక ఉత్తర్వులకు కేబినెట్‌ ఆమోదం కావాల్సి ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సచివాలయంలో సీఎస్‌తో జరిగిన సమావేశంలో పెండింగ్‌లో ఉన్న డీఏలతో పాటు రెండో పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు, పెండింగ్‌ బిల్లుల చెల్లింపు వంటి అంశాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో ఉద్యోగ సంఘాలు పెండింగ్‌ డీఏలు, పీఆర్సీ, బిల్లుల పరిష్కారంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి.

మొత్తం 5 పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 2 డీఏల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో మొదటి డీఏ 3.64 శాతం, రెండో డీఏ 2.74 శాతంగా ఉంటాయి. దీంతో రెండు డీఏల ద్వారా ఉద్యోగుల వేతనాల్లో కరువు భత్యం భాగం పెరగనుంది. ఈ చర్చల్లో కుదిరిన అవగాహన ప్రకారం.. ఒక డీఏను రాబోయే అక్టోబర్‌ నెల జీతంతో కలిపి చెల్లించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. మరో డీఏను ఉగాది సందర్భంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చెల్లింపుల షెడ్యూల్‌కు సంబంధించిన తుది నిర్ణయం అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే స్పష్టం అవుతుంది.

ప్రస్తుతం రెండు డీఏల విషయంలో ప్రభుత్వ స్థాయిలో అంగీకారం వచ్చినప్పటికీ.. కేబినెట్‌ ఆమోదం తర్వాతే తుది నిర్ణయం అధికారిక రూపం దాల్చనుంది. అందువల్ల ఉద్యోగులు కేబినెట్‌ నిర్ణయం.. ఆ తర్వాత జారీ అయ్యే ఉత్తర్వుల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు కేవలం డీఏలకే పరిమితం కాలేదు. రెండో పీఆర్సీని అమలు చేయడం, పీఆర్సీ నివేదికను త్వరగా అందుబాటులోకి తీసుకురావడం, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానంపై నిర్ణయం తీసుకోవడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లులను విడుదల చేయడం వంటి అంశాలను కూడా సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాయి. గతంలో ఉద్యోగ సంఘాలు కనీసం మూడు పెండింగ్‌ డీఏలైనా విడుదల చేయాలని కోరినట్లు నివేదికలు వెల్లడించాయి.

పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగ వర్గాల్లో ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. రెండో పీఆర్సీని 2023 జూలై 1వ తేదీ నుంచి వర్తింపజేయాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. పీఆర్సీ నివేదిక త్వరగా సమర్పించాలని సంఘాల నేతలు ఇప్పటికే కమిషన్‌ చైర్మన్‌ను కోరారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఈ సమావేశం మరోసారి చూపించిందని చర్చల తర్వాత ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిందని.. మిగిలిన అంశాలపైనా పరిష్కార మార్గాలు చూపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.