హైదరాబాద్, మహా : ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీఎన్జీవోస్ మాజీ నేత దేవీప్రసాద్ ఆరోపించారు. హామీల అమలుపై ఉద్యోగులు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. చర్చలు, సమావేశాలు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. పీఆర్సీ గడువు మూడేళ్లు పూర్తయినా ఇప్పటివరకు నివేదికను తెప్పించుకోకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిదర్శనమన్నారు. పీఆర్సీపై చర్చలు కాకుండా నివేదిక, నిర్ణయం, అమలు కావాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు హామీని అమలు చేయకుండా మరోసారి అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం సమస్యను పరిష్కరించేందుకు కాకుండా కాలయాపనకేనని పేర్కొన్నారు. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండగా కేవలం రెండు డీఏలను విడతల వారీగా ఇస్తామని ప్రకటించడం ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ సాలరీ, కమ్యుటేషన్, జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ తదితర బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
ఉద్యోగులు కొత్త వరాలు కోరడం లేదని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలంటున్నారని దేవీప్రసాద్ అన్నారు. చర్చల పేరుతో మరో ఆరు నెలలు కాలయాపన చేస్తే ఉద్యోగులు మరింత బలమైన ప్రజాస్వామ్య ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. హామీల అమలుకు తేదీలతో కూడిన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జాక్ వారి మనోవేదనను ప్రతిబింబించేలా కార్యాచరణకు సిద్ధం కావాలని కోరారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి ఆందోళనలకు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.








