- తెలంగాణ ఉద్యాన అధికారుల సంఘం.
- క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో కుంటుపడుతున్న సేవలు.
- అక్టోబర్ 5లోగా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన బాట.
హైదరాబాద్, మహా:
పెరుగుతున్న నీటి కొరత, ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులను తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే ఉద్యాన పంటల వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకు ఉద్యాన శాఖను తక్షణమే బలోపేతం చేయాలని తెలంగాణ ఉద్యాన శాఖ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. క్షేత్రస్థాయిలో తీవ్రమైన సిబ్బంది కొరత కారణంగా రైతులకు సకాలంలో సేవలు అందడం లేదని, దీనివల్ల వ్యవసాయ రంగంపై, రైతుల ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యాన శాఖ పటిష్టత అనేది కేవలం ఉద్యోగుల సమస్య కాదని, ఇది నేరుగా రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర వ్యవసాయాభివృద్ధితో ముడిపడి ఉన్న విస్తృత అంశమని స్పష్టం చేసింది.
రాష్ట్ర రైతు కమిషన్ నివేదిక ప్రకారం 2014 నుంచి 2025 వరకు వరి సాగు ఏకంగా 259 శాతం పెరగ్గా, కూరగాయల సాగు 81 శాతం మేర పడిపోవడం గమనార్హం. దీని పరిణామంగా రాష్ట్ర అవసరాలకు సరిపడా ఉత్పత్తి లేక ఏటా దాదాపు రూ.5,000 కోట్ల విలువైన కూరగాయలను పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర మొత్తం సాగు విస్తీర్ణంలో ఉద్యాన పంటల వాటా కేవలం ఆరు శాతం మాత్రమే ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో వాటి వాటా సుమారు 30 శాతంగా ఉండటం ఈ రంగం ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా అటు నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఇటు రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు.
రాష్ట్రంలో ఉద్యాన సాగుకు అనుకూలమైన వాతావరణం, వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ, రైతులను ఆ దిశగా నడిపించే విస్తరణ యంత్రాంగం కొరవడింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో ఉద్యాన అధికారి ఐదు నుంచి పది మండలాల బాధ్యతలు మోయాల్సి వస్తోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ తరహాలో కాకుండా, తెలంగాణలో సూక్ష్మ నీటిపారుదల, ఆయిల్‌పామ్ తదితర పథకాల అదనపు భారం కూడా క్షేత్రస్థాయి అధికారులపైనే పడుతోంది. ఇంతటి సువిశాల పరిధిలో ప్రతి గ్రామానికి వెళ్లి సాంకేతిక సలహాలు ఇవ్వడం, పంటలను పరిశీలించడం, రైతులకు శిక్షణ అందించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. పనిభారం పెరగడంతో రైతులకు అందాల్సిన సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని సంఘం పేర్కొంది.
ఈ నేపథ్యంలో శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర రైతు కమిషన్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, పరిపాలనా సిబ్బంది కళాశాల సిఫార్సుల మేరకు ప్రతి మండలానికి కనీసం ఒక ఉద్యాన విస్తరణ అధికారిని, ప్రతి రెండు లేదా మూడు మండలాలకు ఒక ఉద్యాన అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, ఆయిల్‌పామ్, సూక్ష్మ నీటిపారుదల తదితర పథకాలకు ప్రత్యేక సిబ్బంది వ్యవస్థను ఏర్పాటు చేసి అదనపు బాధ్యతలను హేతుబద్ధీకరించాలని డిమాండ్ చేసింది. దీర్ఘకాలంగా ప్రమోషన్లకు నోచుకోని అర్హులైన అధికారులకు శాఖా పదోన్నతి కమిటీ ద్వారా వెంటనే పదోన్నతులు కల్పించడంతో పాటు, విస్తృత క్షేత్ర పర్యటనల నిమిత్తం తగిన ప్రయాణ లేదా వాహన భత్యం మంజూరు చేయాలని కోరింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా తగిన కార్యాలయాలు, సిబ్బందిని కేటాయించాలని సూచించింది.
ఉద్యాన శాఖ అధికారులను కేవలం ఉద్యాన పంటల విస్తరణ, రైతులకు సాంకేతిక సలహాలు అందించడం వంటి వారి ప్రధాన బాధ్యతలపైనే దృష్టి సారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంఘం విజ్ఞప్తి చేసింది. తమ హక్కులు, న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం అక్టోబర్ 5, 2026లోగా సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించని పక్షంలో రైతులు, అధికారుల ప్రయోజనాల సాధన కోసం చట్టబద్ధంగా, శాంతియుతంగా నిరసన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని తెలంగాణ ఉద్యాన శాఖ అధికారుల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.








