Mahaa Daily Exclusive

  విదేశీ కొలువుల సాధన దిశగా కేంద్రం కీలక అడుగు.

Share

• ఉపాధి అవకాశాల పెంపునకు 20 దేశాల ప్రమాణాలతో ‘స్కిల్ మ్యాపింగ్’.
• కేర్‌గివింగ్, నిర్మాణ రంగాల్లో భారతీయ యువతకు భారీ డిమాండ్.
• షాంఘై స్కిల్ ఒలింపిక్స్‌లో సత్తా చాటనున్న 70 మంది యువత.

న్యూఢిల్లీ, మహా.
భారతీయ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను మరింత విస్తృతం చేసే దిశగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ) ముందడుగు వేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వయోధికుల సంఖ్య పెరుగుదల కారణంగా తీవ్రమైన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా భారత్ వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 20 దేశాల ఉద్యోగ ప్రమాణాలకు అనుగుణంగా దేశీయ నైపుణ్య శిక్షణా పాఠ్యాంశాలను సమీకరిస్తూ ‘స్కిల్ మ్యాపింగ్’ ప్రక్రియను ప్రారంభించినట్లు శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు మనీషా సేన్ శర్మ వెల్లడించారు. ఈ నిర్ణయంతో గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా శిక్షణ పొందిన భారతీయ యువతకు విదేశాల్లో సులభంగా ఉద్యోగాలు సాధించే మార్గం సుగమం కానుందని ఆమె వివరించారు.
అంతర్జాతీయ స్థాయిలో కేర్‌గివింగ్ (సంరక్షకులు), నిర్మాణ రంగాలతో పాటు ఇతర నైపుణ్య, పాక్షిక నైపుణ్య విభాగాల్లో భారత యువతకు విపరీతమైన డిమాండ్ నెలకొందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా యూఏఈ తదితర దేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం భారీగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతున్న వేళ, అత్యధిక యువ జనాభా కలిగిన భారత్‌కు ఈ ‘జనాభా ప్రయోజనం’ (డెమోగ్రాఫిక్ డివిడెండ్) రాబోయే కొన్నేళ్ల పాటు అతిపెద్ద సానుకూల అంశంగా మారనుందని మనీషా సేన్ శర్మ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే దేశీయ శిక్షణా ప్రమాణాలను గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా మారుస్తూ, స్వదేశంతో పాటు విదేశీ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యమైన వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు నైపుణ్యాల ఒలింపిక్స్‌గా భావించే ‘వరల్డ్‌స్కిల్స్ షాంఘై-2026’ టోర్నమెంట్‌లో భారత్ తన సత్తా చాటేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు చైనాలోని షాంఘై వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ తరఫున 70 మంది సభ్యులతో కూడిన అత్యంత భారీ బృందం బరిలోకి దిగింది. మొత్తం 63 నైపుణ్య విభాగాల్లో మన యువత ప్రపంచ దేశాల పోటీదారులతో తలపడనున్నారు. ఇలాంటి అంతర్జాతీయ పోటీలు భారతీయ యువత ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు, అంతర్జాతీయ నైపుణ్య ప్రమాణాలను అందిపుచ్చుకోవడానికి అద్భుత వేదికగా నిలుస్తాయని కేంద్రం భావిస్తోంది.