Mahaa Daily Exclusive

  రాష్ట్రాల వారీగా బీజేపీ నూతన ఇన్‌ఛార్జ్‌ల నియామకం.

Share

* తెలంగాణ బాధ్యతలు సునీల్ బన్సల్‌కే!
* హరియాణా, ఛత్తీస్‌గఢ్‌లకు స్మృతి ఇరానీ.
* యూపీకి వినోద్ తావ్డే.
* దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు నేతల ఖరారు.
* కమ్యూనికేషన్ విభాగంలోనూ సంస్థాగత మార్పులు.

న్యూఢిల్లీ, మహా .
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా భారీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. సంస్థాగత పటిష్ఠతే ధ్యేయంగా దేశంలోని 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు, సహ ఇన్‌ఛార్జ్‌లను (కో-ఇన్‌ఛార్జ్‌లు) అధిష్ఠానం బుధవారం నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా దక్షిణాదిన అత్యంత ప్రాధాన్యమున్న తెలంగాణ వ్యవహారాల పర్యవేక్షణను మరోసారి పార్టీ సీనియర్ నేత సునీల్ బన్సల్‌కే అప్పగించింది. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్ బాధ్యతలను కూడా ఆయనే సమన్వయం చేయనున్నారు. తెలంగాణకు కో-ఇన్‌ఛార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను నియమించగా.. బెంగాల్‌కు లాల్ సింగ్ ఆర్య, రాజేంద్ర సింగ్, పింకీ కుష్వాహాలు కో-ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించనున్నారు.
మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీకి హరియాణా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల పూర్తి బాధ్యతలను కట్టబెట్టారు. ఈ రెండు రాష్ట్రాలకు సిద్ధార్థ్ శంభు కో-ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేను నియమించగా.. జగదీశ్ పటేల్, మేధా కులకర్ణి, ప్రదీప్ శర్మ, అనంత్ ఓజాలు ఆయనకు సహకరించనున్నారు. మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా పార్టీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా నియమితులు కాగా, అమిత్ మాలవీయ, సదానంద్ షెట్ తానవాడే, కమల్‌జీత్ సెహ్రావత్‌లు కో-ఇన్‌ఛార్జ్ బాధ్యతలు చేపట్టనున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వ్యవహారాల పర్యవేక్షణను సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధేకు అప్పగించగా, జమ్యాంగ్ త్సెరింగ్ నంగ్యాల్, దర్శనా జర్దోష్ ఆయనతో కలిసి పనిచేయనున్నారు. పార్టీ మరో ఉపాధ్యక్షుడైన రామ్ మాధవ్‌కు ఉత్తరాఖండ్ బాధ్యతలు అప్పగించగా, అరవింద్ మీనన్, ఎంపీ బాన్సురీ స్వరాజ్‌లు అసోసియేట్స్‌గా వ్యవహరించనున్నారు.
రాష్ట్రాల నియామకాలతో పాటే పార్టీ కమ్యూనికేషన్ విభాగంలోనూ అధిష్ఠానం కీలక మార్పులు చేపట్టింది. పార్టీ జాతీయ మీడియా విభాగం, సోషల్ మీడియా విభాగాలను ఏకతాటిపైకి తెస్తూ ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ విభాగానికి అనిల్ బలూనీని సమన్వయకర్తగా నియమించారు. ఇటీవల నేషనల్ మీడియా విభాగం కో-కన్వీనర్‌గా నియమితులైన ఆశిశ్ ఉషా అగర్వాల్‌కు పూర్తిస్థాయి కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణను దృష్టిలో ఉంచుకునే ఈ సమగ్ర మార్పులు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.