Mahaa Daily Exclusive

  ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేతల నిప్పులు.

Share

  •  ‘ఓటు చోరీ’ రాజ్యాంగ విరుద్ధమన్న ఖర్గే.
  •  ఈసీఐ అనుమతితో అక్రమాలు జరిగితే అది దేశద్రోహమే.
  •  రాహుల్ గాంధీ.
  •  పారదర్శకత లేకుంటే ప్రజాస్వామ్యానికే ముప్పు: ఎంపీ ప్రియాంక గాంధీ.

    న్యూఢిల్లీ, మహా.

దేశంలో ఎన్నికల నిష్పాక్షికత, పారదర్శకతపై రాజకీయ దుమారం తారస్థాయికి చేరింది. ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన పరిశోధనాత్మక కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాజ్యాంగబద్ధ సంస్థగా వ్యవహరించాల్సిన కమిషన్, ప్రజాస్వామ్య మూలాలకే గొడ్డలిపెట్టుగా మారుతోందంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు.
కేరళలోని మలప్పురం జిల్లా నిలంబూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే అసలు ప్రజాస్వామ్యానికే అర్థం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును తారుమారు చేసేందుకు జరిగే అక్రమాలకు ఎన్నికల సంఘమే సహకరిస్తే, అది భారత ప్రజాస్వామ్యంపై జరిగే అత్యంత తీవ్రమైన దాడి అని ఆమె మండిపడ్డారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే ఏ చర్యలనైనా తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
మరోవైపు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఈసీఐ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. ఎన్నికల కమిషనర్లకు క్షేత్రస్థాయిలో జరిగే అక్రమాల గురించి తెలిసీ అనుమతిస్తుంటే, అది ముమ్మాటికీ తీవ్రమైన ‘దేశద్రోహ చర్య’ కిందకే వస్తుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాల్సిన అధికారులే ఇందుకు బాధ్యులైతే సహించేది లేదన్నారు.
ఓటు హక్కును హరించడం లేదా ఓట్లను దొంగిలించడం అనేది భారత ప్రజలకు, పవిత్రమైన రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగే క్షమించరాని నేరమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఈ అక్రమ వ్యవహారాల్లో అధికార యంత్రాంగం భాగస్వామ్యం కావడంపై ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాజ్యాంగ వ్యతిరేక పనులకు పాల్పడుతున్న అధికారులు వెంటనే అటువంటి చర్యలకు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. దినపత్రిక కథనం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై జాతీయ స్థాయిలో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.