- పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.
- ఆర్యవైశ్యులు విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లు.
- ఐక్యంగా ముందుకు సాగితే రాజకీయాల్లో సముచిత వాటా సాధించుకోవచ్చు.
సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్, మహా:
పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సౌమ్యులు, మానవతావాదులుగా ఆర్యవైశ్యులు సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారని, పేదల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లుగా గొప్ప పాత్ర పోషిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి సీఎం శంకుస్థాపన చేశారు.
పేద కుటుంబాల పిల్లలకు ఉపయోగపడాలి
ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ భవనం కేవలం ఆత్మగౌరవానికి ప్రతీకగా కాకుండా పేద ఆర్యవైశ్య కుటుంబాలకు, ముఖ్యంగా వారి పిల్లలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సంఘాల ప్రతినిధులకు సూచించారు. విద్య, అవకాశాలు, సామాజిక అభివృద్ధికి ఈ భవనం వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.
గాంధీ, పొట్టి శ్రీరాములు, రోశయ్య సేవలు ప్రస్తావన
సాధారణ ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన మహాత్మా గాంధీ ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదగడం దేశానికే గర్వకారణమని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో గాంధీజీ విగ్రహాలు కనిపిస్తాయని గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మంత్రిగా కొణిజేటి రోశయ్య అందించిన విశేష సేవలను సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు.
విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లు
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అవసరమైన సరుకులను అరువుగా ఇచ్చే విషయంలో ఆర్యవైశ్యులు మానవతతో వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే వారు ప్రజల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారని అన్నారు. ముందు చూపుతో వ్యవహరించడం, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ఆర్యవైశ్యుల ప్రత్యేకతగా అభివర్ణించారు.
ఐక్యతతోనే రాజకీయ ప్రాతినిధ్యం
ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా, సమైక్యంగా ఒక్కతాటిపై నడవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ఐక్యతే బలంగా మారినప్పుడే రాజకీయాల్లో తమకు దక్కాల్సిన వాటాను సాధించుకోగలరని అన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.
ఈ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.








