Mahaa Daily Exclusive

  బ్రిక్స్‌కు చైనా ఐదు ప్రతిపాదనలు.. జిన్‌పింగ్‌ కీలక పిలుపు

Share

బ్రిక్స్‌కు చైనా ఐదు ప్రతిపాదనలు.. జిన్‌పింగ్‌ కీలక పిలుపు
*ఏఐ నుంచి స్మార్ట్‌ ఫ్యాక్టరీల వరకు.. కొత్త దిశగా బ్రిక్స్‌
*బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణంలో బ్రిక్స్‌ కీలక పాత్ర పోషించాలి: జిన్‌పింగ్‌

ఢిల్లీ, మహా:
అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్‌ను మరింత క్రియాశీలక శక్తిగా తీర్చిదిద్దేందుకు చైనా ఐదు కీలక ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన బ్రిక్స్‌ రెండో సెషన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రసంగించారు. ఆ ప్రసంగ పాఠాన్ని చైనా అధికారికంగా విడుదల చేసింది. కృత్రిమ మేధ (ఏఐ), వాణిజ్యం–పెట్టుబడులు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్‌ పరిశ్రమలు, విద్య–పరిశోధన రంగాల్లో సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంచేలా ఈ ప్రతిపాదనలను రూపొందించారు.

అంతర్జాతీయ నియమ నిబంధనలు లేకుండా ప్రపంచాన్ని నడపడం సాధ్యం కాదని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. అంతర్జాతీయ నియమాలు కొన్ని దేశాలు లేదా శక్తులు మాత్రమే నిర్ణయించకూడదని.. ప్రపంచ దేశాలన్నీ కలిసి రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో సమానత్వం, న్యాయం ప్రతి దేశానికి దక్కాలన్నదే ప్రపంచ ప్రజల ఆకాంక్షగా అభివర్ణించారు. ‘బలవంతుడిదే రాజ్యం’ అనే ఆలోచనకు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు.

ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా గ్లోబల్‌ సౌత్‌ దేశాలు మరింత ఐక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్‌ అన్నారు. వివిధ సవాళ్లను సమష్టిగా ఎదుర్కొంటూ బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణంలో బ్రిక్స్‌ మరింత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సభ్యదేశాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు అంతర్జాతీయ స్థిరత్వానికి బ్రిక్స్‌ దోహదపడాలని ఆకాంక్షించారు.

చైనా తన మార్కెట్‌ను మరింతగా తెరుస్తోందని జిన్‌పింగ్‌ తెలిపారు. చైనాతో అధికారిక దౌత్య సంబంధాలు కలిగిన 53 ఆఫ్రికా దేశాల ఉత్పత్తులను కస్టమ్స్‌ టారిఫ్‌ లేకుండా చైనా మార్కెట్‌లోకి అనుమతించే జీరో టారిఫ్‌ వాణిజ్య సదుపాయాన్ని కల్పించినట్లు చెప్పారు. ఆఫ్రికా దేశాలకే పరిమితం కాకుండా ఇతర పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలతోనూ అవకాశాలను పంచుకోవడానికి చైనా సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం ఏకపక్ష స్వేచ్ఛా వాణిజ్య విధానాలను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు.

ఏఐలో తొలి అడుగు

ఆధునిక సాంకేతిక యుగంలో కృత్రిమ మేధ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బ్రిక్స్‌ దేశాలు ఈ రంగంలో కలిసి పనిచేయాలని జిన్‌పింగ్‌ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా బ్రిక్స్‌ ఏఐ ఓపెన్‌ సోర్స్‌ కమ్యూనిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. సభ్యదేశాల్లో అధునాతన లాంగ్వేజ్‌ మోడళ్ల అభివృద్ధికి పరస్పర సహకారం అందించడం, ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు.

పరిశ్రమలు.. పెట్టుబడులకు ఊతం

రెండో ప్రతిపాదనగా వాణిజ్యం, పెట్టుబడులను మరింత సులభతరం చేయడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్ల మధ్య భాగస్వామ్యాన్ని పెంచాలని జిన్‌పింగ్‌ సూచించారు. తద్వారా కొత్త పారిశ్రామిక సహకార వేదికను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యదేశాల మధ్య పెట్టుబడులు, ఉత్పత్తి, వాణిజ్య అవకాశాలు పెరగడానికి ఇది దోహదపడుతుందని వివరించారు.

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ

మూడో ప్రతిపాదనగా బ్రిక్స్‌ డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయాలని జిన్‌పింగ్‌ ప్రతిపాదించారు. సభ్యదేశాల ప్రతినిధులకు డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిని వేగవంతం చేయడం ఈ వేదిక ద్వారా సాధించాలని సూచించారు. డిజిటల్‌ ఫైనాన్స్‌ వ్యవస్థ అభివృద్ధికి పరస్పర సహకారం కీలకమని పేర్కొన్నారు.

స్మార్ట్‌ ఫ్యాక్టరీల వైపు

సంప్రదాయ పరిశ్రమలను ఆధునీకరించి కొత్త సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం నాలుగో ప్రతిపాదనలో ప్రధాన అంశంగా ఉంది. స్మార్ట్‌ ఫ్యాక్టరీల నిర్మాణంలో సభ్యదేశాల మధ్య సాంకేతిక ప్రమాణాలను మెరుగుపరచాలని జిన్‌పింగ్‌ సూచించారు. పరిశ్రమల్లో ఆధునిక సాంకేతికత వినియోగం పెంచడం ద్వారా ఉత్పాదకతను మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు.

యువ ఇంజినీర్లకు కొత్త వేదిక

ఐదో ప్రతిపాదనగా బ్రిక్స్‌ ఇంజినీర్‌ కల్టివేషన్‌ అలయన్స్‌ను ఏర్పాటు చేయాలని జిన్‌పింగ్‌ సూచించారు. విద్య, పరిశోధన రంగాల్లో సహకారాన్ని పెంచడం, సభ్యదేశాల యువ ఇంజినీర్ల నైపుణ్య ప్రమాణాలను పరస్పరం గుర్తించడం, శాస్త్రీయ పరిశోధనల మార్పిడిని వేగవంతం చేయడం ఈ వేదిక లక్ష్యాలుగా పేర్కొన్నారు.

సాంకేతిక ప్రతిభను పెంపొందించడంతోపాటు మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి ఇలాంటి సహకార కార్యక్రమాలు అవసరమని జిన్‌పింగ్‌ అన్నారు. మొత్తంగా ఏఐ, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, ఆధునిక పరిశ్రమలు, వాణిజ్యం, మానవ వనరుల అభివృద్ధిని కేంద్రంగా చేసుకుని బ్రిక్స్‌ భవిష్యత్‌ కార్యాచరణ సాగాలన్నది చైనా ప్రతిపాదనల సారాంశంగా కనిపిస్తోంది.