- మీ జాగ్రత్తే మీ భద్రతకు రక్షణ
- వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకుందాం
- మట్వాడ ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ రావు
- డీజే శబ్దాలకు దూరంగా భక్తితోనే నిమజ్జనం మట్వాడ పోలీసుల విజ్ఞప్తి
వరంగల్, మట్వాడ, మహా ;
వినాయక చవితి పండుగ అంటేనే భక్తి, ఆనందం, ఐక్యతకు ప్రతీక. అలాంటి పండుగను వరంగల్ మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరుపుకోవాలని మట్వాడ ఇన్స్పెక్టర్ ఎన్. కరుణాకర్ రావు ప్రజలకు, ఉత్సవ కమిటీలకు పిలుపునిచ్చారు.
వరంగల్ నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే మట్వాడ పరిధిలో ఈసారి దాదాపు 300 పైగా గణేష్ మండపాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేక సందేశం ఇచ్చారు.
ఇన్స్పెక్టర్ సూచనలు – ప్రజలందరూ పాటించాల్సినవి
1. మీ జాగ్రత్తే మీ రక్షణ అని మండపాల వద్ద విద్యుత్ దీపాల అలంకరణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలను విగ్రహాల దగ్గర, కరెంట్ వైర్ల దగ్గర వదలకండి. రాత్రిపూట మండపం వద్ద తప్పనిసరిగా ఒకరిని కాపలా ఉంచండి.
2. అన్నదానం చేసినప్పుడు పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో రద్దీగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో దొంగతనాలు జరగకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనుమతులు తప్పనిసరి
ప్రతి మండప నిర్వాహకుడు పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని మీ వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని రోడ్డుకు అడ్డంగా మండపాలు పెట్టవద్దని సూచించారు.
డీజే వద్దు – డప్పు ముద్దు
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు వాడకూడదు. చెవులు చిల్లులు పడేలా డీజే లు పెట్టడం వల్ల వృద్ధులకు, చిన్నపిల్లలకు, ఆసుపత్రిలో ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా భక్తి సంగీతాన్ని తక్కువ శబ్దంతో పెట్టుకోండి. మన సంస్కృతి అయిన డోలు, కోలాటం, భజనలతో పండుగను ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో అప్రమత్తం
వినాయక ఉత్సవాలకు సంబంధించి ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే నమ్మకండి. అలాంటివి కనిపిస్తే వెంటనే 112 కు డయల్ చేసి మాకు సమాచారం ఇవ్వండి. మత సామరస్యాన్ని చెడ గొట్టేవారి పై కఠిన చర్యలు తీసుకుంటాం.
నిమజ్జనం రోజు అప్రమత్తంగా ఉండాలి
నిమజ్జనానికి వెళ్లేటప్పుడు మద్యం తాగి వాహనాలు నడపకూడదని యువత అత్యుత్సాహంతో చెరువుల్లోకి దిగి ప్రమాదాలకు గురికావద్దని పోలీసులు చెప్పిన రూట్ లోనే శాంతియుతంగా నిమజ్జనం చేయాలని కోరారు.
మట్వాడ పోలీసులు మీకు అండగా
ఎలాంటి సమస్య ఉన్నా మట్వాడ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని, 24 గంటలు పోలీసులు అందుబాటులో ఉంటారని ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు తెలిపారు. పండుగ అందరిదీ, బాధ్యత కూడా అందరిదీ అని ఆయన పేర్కొన్నారు.








