Mahaa Daily Exclusive

  రాజకీయ రాకాసి కోరల్లో ఒక సామాన్య కార్యకర్త సమిధ….

Share

రాజకీయ రాకాసి కోరల్లో ఒక సామాన్య కార్యకర్త సమిధ..
* “నా పిల్లలు అనాథలవుతున్నారు.. దయచేసి ఆదుకోండి” అంటూ భారాస నాయకుడి కన్నీటి ఘోష!

హైదరాబాద్, మహా.
నాయకుల పిలుపు వస్తే ఉరికులు పరుగులు.. పార్టీ కార్యక్రమం అంటే సొంత పనులన్నీ వదిలేసి వాలిపోవడం.. గెలుపు కోసం అహర్నిశలు శ్రమించడం.. ఇదీ ఒక సామాన్య కార్యకర్త దినచర్య. కానీ, ఆ రాజకీయ వ్యామోహమే ఒక నిరుపేద కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేసింది. పార్టీ కోసం ప్రాణమిచ్చే కార్యకర్త, చివరకు అదే పార్టీ కార్యక్రమాల కోసం చేసిన అప్పుల ఊబిలో కూరుకుపోయి తన ప్రాణాలనే బలితీసుకున్నాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండల భారాస మాజీ అధ్యక్షుడు, ఆర్ఎంపీ డాక్టర్ సింహాచలం జగన్ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. తన చావుతోనైనా తన కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న ఆశతో, కన్నీటిని సిరాగా మార్చి ఆయన రాసిన ఆఖరి అక్షరాలు రాజకీయ వ్యవస్థలోని చీకటి కోణాన్ని నగ్నంగా సమాజం ముందు నిలబెట్టాయి.
అది కేవలం ఒక సూసైడ్ నోట్ కాదు, రాజకీయ వ్యవస్థలో నలిగిపోయిన ఒక బడుగు జీవి ఆక్రందన. 2019 నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన జగన్, రోజువారీ రాజకీయ ఖర్చుల కోసం తన ఆర్ఎంపీ వృత్తిని సైతం పక్కనపెట్టారు. నెలకు 30 వేల పైచిలుకు ఖర్చులు మీదపడటంతో నాలుగేళ్లు తిరిగేసరికి వడ్డీలతో కలిపి అప్పు పద్నాలుగు లక్షలకు చేరింది. ఆ అప్పులు తీర్చడానికి, ఈఎంఐలు కట్టడానికి పర్సనల్ లోన్లు, ఇంటిపై లోన్లు తీసుకుంటూ అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోయారు. ప్రాణప్రదంగా చూసుకునే కారును పోగొట్టుకున్నా ఆర్థిక కష్టాలు తీరలేదు. చివరకు భార్య పల్లవి పుస్తెల తాడును, పిల్లల బంగారాన్ని సైతం కుదువపెట్టి పార్టీ కోసమే ఖర్చు చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేక, చేసిన అప్పులు తీర్చే దారి కానరాక, ప్రతి నిమిషం నరకం అనుభవిస్తూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఒక పచ్చని కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది.
“నా పిల్లలు అనాథలవుతున్నారు దేవుడా.. నా పల్లవిని, పిల్లలను మీరే ఆదుకోవాలి” అంటూ ఆయన రాసిన ప్రతి అక్షరం చదువుతుంటే కళ్లు చమర్చక మానవు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న తన భార్యకు ఈ నిజం తెలిస్తే తట్టుకోలేదని, ఏనాడూ తన పిల్లలు సంజన, సుధాంష్‌లకు కనీస అవసరాలు కూడా తీర్చలేకపోయానని ఆయన పడ్డ కుమిలిపాటు అంతా ఇంతా కాదు. “నా పిల్లల పాపం నాకు కచ్చితంగా తగులుతుంది.. ఏనాడూ వారికి ఏమీ చేయని మూర్ఖుడిని నేను” అని తనను తాను నిందించుకుంటూ ఆయన రాసిన మాటలు ఎవరినైనా కన్నీటి పర్యంతం చేస్తాయి. పార్టీ కోసం కచ్చితంగా గెలిచే ఎంపీటీసీ సీటును సైతం పెద్దల మాట కోసం త్యాగం చేసిన ఆ నిజాయితీపరుడికి, ఆ రాజకీయమే చివరకు ఉరితాడుగా మారడం అత్యంత దురదృష్టకరం.
తను నమ్ముకున్న నాయకులే తన కుటుంబాన్ని ఆదుకోవాలని చావు అంచున నిలబడి జగన్ చేసిన విన్నపం ప్రతి నాయకుడి గుండెల్లో మార్మోగాల్సిన అవసరం ఉంది. కేసీఆర్, కేటీఆర్, ముఖ్యంగా స్థానిక మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు స్పందించి తన అనాథ పిల్లలను గుండెలకు హత్తుకోవాలని ఆయన దీనంగా ప్రాధేయపడ్డారు. “దయచేసి ఎవరూ నాలా చేయకండి.. కుటుంబం గురించి ఆలోచించండి” అంటూ తోటి కార్యకర్తలకు ఆయన ఇచ్చిన సందేశం ఒక చెంపపెట్టు లాంటిది. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా, ఊరి కోసం, పార్టీ కోసం బతికిన ఆ నాయకుడి చివరి మజిలీ బాధ్యతను గ్రామస్తులకు అప్పగిస్తూ.. అనంత లోకాలకు వెళ్లిపోయిన సింహాచలం జగన్ విషాదాంతం, ఆడంబరాల రాజకీయాలకు ఒక సజీవ సాక్ష్యంగా మిగిలిపోతుంది.