Mahaa Daily Exclusive

  మోదీజీ 25 ఏళ్ల ప్రజాసేవ..! భాజపా జాతీయ సహ ఇన్‌చార్జి, తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి..

Share

  •  దేశం కోసం అంకితమైన ప్రస్థానం.
  •  సేవ, వినయం, క్రమశిక్షణకు ప్రతీక మోదీ.
  • ప్రతి బూత్‌లో ప్రజలతో మమేకం కావాలి.
  •  భాజపా జాతీయ సహ ఇన్‌చార్జి, తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి.

తిరుచిరాపల్లి, మహా.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం సేవ, వినయం, క్రమశిక్షణ, దేశమే ముందు అనే అచంచల సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని భాజపా జాతీయ సహ ఇన్‌చార్జి, తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. మోదీ ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా సాధారణ కార్యకర్తగా ఉండే స్వభావాన్ని విడిచిపెట్టలేదని, ప్రజాసేవను ఒక కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా భావించారని పేర్కొన్నారు.

తిరుచిరాపల్లి సమీపంలోని సమయపురం ఎమరాల్డ్‌ హాల్‌లో మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సేవా సంకల్ప కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేందన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీకి చెందిన పలువురు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మహిళా విభాగం, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పదవులు మారినా కార్యకర్త స్వభావం మారలేదు

కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సుధాకర్‌రెడ్డి.. మోదీజీ వ్యక్తిత్వంలోని వినయం, నిరంతర సేవాభావం తనను అత్యంత ప్రభావితం చేశాయని అన్నారు. ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినప్పటికీ సాధారణ కార్యకర్తగా ప్రజలతో మమేకమయ్యే తత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారని చెప్పారు. బాధ్యతలు, పదవులు మారినా మోదీలోని కార్యకర్త స్వభావం మారలేదని, ప్రజలకు సేవ చేయడమే ఆయన జీవిత ధ్యేయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

ప్రజలతో నేరుగా మమేకం కావాలి

మోదీ ప్రజాసేవా ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలను కేవలం సభలు, ప్రచార కార్యక్రమాలకే పరిమితం చేయరాదని సుధాకర్‌రెడ్డి సూచించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం స్థాయిలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిని నేరుగా కలుసుకోవడంతో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు.

తమిళ భాష, సంస్కృతికి ప్రత్యేక ప్రాధాన్యం

తమిళ భాష, సంస్కృతి, నాగరిక వారసత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సుధాకర్‌రెడ్డి కోరారు. సెంగోల్‌ ప్రతిష్ఠాపన, కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం, రాజేంద్ర చోళుడి వైభవానికి జాతీయ స్థాయిలో గుర్తింపు, గంగైకొండ చోళపురం వారసత్వానికి ప్రాధాన్యం, ప్రాచీన తమిళ భాషకు ప్రోత్సాహం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. తమిళుల భాషా, సాంస్కృతిక వారసత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించేందుకు తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని సూచించారు.

అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

తిరుచిరాపల్లి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలని సుధాకర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన ప్రయాణికుల భవనం, పాంబన్‌ రైల్వే వంతెన, తూత్తుకుడి నౌకాశ్రయ అనుసంధానం, రహదారులు, రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వైద్య విద్య, ఆరోగ్య రంగాల్లో జరుగుతున్న విస్తరణను ప్రజలకు తెలియజేయాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరేలా వివరించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని అన్నారు.

ప్రజలకు చేరువ కావడం, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా సేవా కార్యక్రమాలకు మరింత అర్థవంతమైన రూపం ఇవ్వాలని సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, సేవాభావంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తే ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.