Mahaa Daily Exclusive

  ఇన్నాళ్లు పార్టీలకు జై కొట్టాం..! ‘ఇక యువత భవిత కోసం జై కొట్టాలి..!

Share

  • ఇన్నాళ్లు పార్టీలకు జై కొట్టాం.
  • ‘ఇక యువత భవిత కోసం జై కొట్టాలి
  •  జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’ ఆవిష్కరణ.
  • యువతలో రాజకీయ చైతన్యంతో పాటు సేవాభావం పెరగాలి.
  •  డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

పిఠాపురం, మహా.
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగానికి శ్రీకారం చుట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ‘జై కొట్టు’ పేరుతో యువజన విభాగం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘జై కొట్టు’ గేయాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

యువజన విభాగం ఆవిర్భావం సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ఆడియో సందేశం ద్వారా యువతకు దిశానిర్దేశం చేశారు. రాజకీయ, సామాజిక మార్పులో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కేవలం నాయకులు, రాజకీయ పార్టీల కోసం నినాదాలు చేయడం కాకుండా.. యువత భవిష్యత్తు, సమాజం, దేశం కోసం పనిచేసే దిశగా ముందుకు సాగాలని సూచించారు.

“దేహి అని దేనికోసం చేతులు చాపవద్దు.. దేశం కోసం పని చేసే చేతులు కావాలి” అంటూ యువతలో స్వావలంబన, సేవాభావం పెరగాలని పవన్‌ ఆకాంక్షించారు. యువత తమ ఉనికిని చాటుకోవడంతో పాటు సమాజంలో మార్పు తీసుకొచ్చే శక్తిగా ఎదగాలని సూచించారు.

యువత భవిత కోసమే నినాదం

ఇన్నాళ్లూ నాయకులు, రాజకీయ పార్టీల కోసం నినాదాలు చేశామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇకపై యువత కోసం, వారి భవిత కోసం, సమాజంలో మార్పు కోసం, ప్రజల తీర్పు కోసం ‘జై కొట్టు’ అని నినదించాలని పిలుపునిచ్చారు. పట్టు వదలని ప్రజల కోసం పోరాడే సేనకు జై కొట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో యువత ముందుండాలని ఆకాంక్షించారు.

రాజకీయ చైతన్యంతో పాటు బాధ్యత

యువతలో కేవలం రాజకీయ ఆసక్తిని పెంచడం మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత, సేవా దృక్పథాన్ని పెంపొందించడమే ‘జై కొట్టు’ యువజన విభాగం ప్రధాన లక్ష్యంగా జనసేన భావిస్తోంది. ప్రజా సమస్యలను గుర్తించడం, వాటిపై స్పందించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, యువతకు నాయకత్వ అవకాశాలు కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పిఠాపురంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలతో పాటు కొత్త యువజన విభాగం ఆవిష్కరణ జరగడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.