Mahaa Daily Exclusive

  ఉత్తరాంధ్రకు గోదావరి జలధార..! పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు…

Share

• పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు.
• 5.23 లక్షల మందికి తాగునీరు.

అనకాపల్లి, మహా.

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల సాగునీటి కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చేరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్‌ను ప్రారంభించి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వైపు విడుదల చేశారు. అనంతరం జలహారతి నిర్వహించారు.

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా విడుదలైన నీటితో నాలుగు జిల్లాల పరిధిలోని 2,87,320 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ప్రయోజనం కలగనుంది. అంతేకాకుండా సుమారు 5.23 లక్షల మందికి తాగునీటి భరోసా లభించనుంది. అనకాపల్లి జిల్లాలోనే దాదాపు 1.50 లక్షల ఎకరాలకు నీటి ప్రయోజనం అందేలా ప్రణాళిక రూపొందించారు. ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను కూడా గోదావరి జలాలతో నింపేందుకు చర్యలు చేపట్టారు.

కష్టమైన భూభాగంలో కాలువ నిర్మాణం

గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించేందుకు నిర్మించిన ఎడమ ప్రధాన కాలువ సుమారు 213 కిలోమీటర్ల పొడవున సాగుతోంది. తూర్పు కనుమలలోని క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమిస్తూ కాలువను నిర్మించారు. మార్గంలో ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద నదీ ప్రవాహాలను దాటేందుకు అక్విడెక్టులు, సైఫన్లు, ఇతర ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. కాలువ నిర్మాణానికి ఇప్పటివరకు సుమారు రూ.4,192 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు.

రైతులకు కొత్త భరోసా

గోదావరి జలాలతో ఏలేరు, పుష్కర, పంపా, తాండవ, వరాహ తదితర ఆయకట్టులకు నీటి స్థిరీకరణ జరగనుంది. ముఖ్యంగా పుష్కర ఆయకట్టులో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80,700 ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలకు ప్రయోజనం కలగనుంది. తాండవ, వరాహ, మామిడిగెడ్డ ప్రాంతాల్లో మరో 46,620 ఎకరాలకు నీటి భరోసా లభించనుంది.

ప్రస్తుతం విడుదలైన నీటితో పాటు భవిష్యత్తులో పోలవరం ఎడమ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానించి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ అనుసంధానం పూర్తయితే ఉత్తరాంధ్రలో సుమారు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు, తాగునీటి ప్రయోజనాలు విస్తరించే అవకాశం ఉంది.