- మంత్రి కొండా సురేఖపై తిరుగుబాటు
- భర్తరఫ్ చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- కూతురు సుష్మితా పటేల్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని నిలదీత
- సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సంహించేది లేదని స్పష్టం
- సీఎల్పీలో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
హైదరాబాద్, మహా : సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించక పోవడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వంత కూతురు సుష్మిత సీఎంపై లేని పోని వ్యాఖ్యలు చేసినప్పటికీ మంత్రిగా కొండా సురేఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని వారు నిలదీశారు. సుష్మిత వ్యాఖ్యలను తామంతా తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత మాట్లాడిన మాటలను ఖండించాలని డిమాండ్ చేశారు. ఏదైనా సమస్య ఉంటే సీఎల్పీ సమావేశం, పీసీసీ సమావేశంలో మాట్లాడాలని సూచించారు. సీఎంపై ఎవరు తప్పుడు ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సొంత పార్టీలో ఉండే నేతలు, సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. సీఎల్పీలో మంత్రి కొండా సురేఖ వివాదంపై నిర్వహించిన ప్రెస్మీట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కూచుకుళ్ల రాకేశ్ రెడ్డి, బాలు నాయక్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, వంశీ కృష్ణ, వీర్లపల్లి శంకర్, వెడ్మ బొజ్జు, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్, కుందూరు జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలు అండగా ఉండాలని అంతేకాని, విమర్శించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. చెట్టు కింద ఉండి చెట్టుకొమ్మనే నరుక్కొనే వైఖరి సరికాదన్నారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పడం ఆమోద యోగ్యం కాదని, సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేకుంటే కొండా సురేఖ ఖండించాలని వారంతా డిమాండ్ చేశారు. మంత్రి కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం మూల్యం చెల్లిస్తుంటే, మీరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. వారి భాష ప్రతిసారీ పార్టీకి తలనొప్పిగా మారుతుందని, కొండా సురేఖ గతంలోనూ నోరుజారి పార్టీకి ఇబ్బంది తెచ్చారని గుర్తు చేశారు. ఇలా మాట్లాడే వారిపై ఏఐసీసీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు.
10 రాక్షస పాలనను అంతమొందించి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎంతో పడ్డారని గుర్తు చేశారు. సీఎంపై అనవసర ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి తలనొప్పిగా మారిన వ్యక్తులను పదవుల నుంచి తప్పించాలని కోరారు. బజారుకు వచ్చి మాట్లాడటం కాంగ్రెస్ సంస్కృతి కాదని మండిపడ్డారు. సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సుష్మిత వ్యాఖ్యలను గ్రామీణ స్థాయి కార్యకర్తలు కూడా అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎంను బలహీనపరచాలనే ప్రతిపక్షాల కుట్రను వీరు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం, ప్రభుత్వాన్ని బలహీనపరిచే వారిపై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించిన వారికి షోకాజ్ నోటీసు ఇచ్చి సరిపెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కొండా సురేఖ భాగం, మరి ఆ నిర్ణయాలను ఆమె కుమార్తెనే విమర్శిస్తుంటే ఖండించరా? అని నేతలు ప్రశ్నించారు. మంత్రి సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలని వారు పార్టీ అధిష్టానాన్ని కోరారు. ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించేలా కొండా సుస్మిత వ్యాఖ్యలున్నాయని, ఇది సరికాదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. విచ్చలవిడిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నాలుగు పార్టీలు తిరిగొచ్చినోళ్లు ఒరిజినల్ కాంగ్రెస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. వారు ఏ పార్టీలో సక్రమంగా లేరని గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్లోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్‌కు వచ్చారన్నారు. రేవంత్ ను తామే సీఎం చేశామని తుపాకీ రాముడిలా మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ ఎన్నికల్లో వరంగల్‌లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చిందని, ఒక్క సురేఖ నియోజకవర్గంలోనే కాంగ్రెస్‌కు మెజార్టీ రాలేదన్నారు. తమ పార్టీలోనే కొందరు గుంటనక్కలు ఉండి వీళ్లను నడిపిస్తున్నారని మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించాలని డిమాండ్ చేశారు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఆమెవి కాదని, అవి కొండా సురేఖ మాటలేనని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు విమర్శించారు. సుస్మిత ఇలాంటి మాటలు మాట్లాడటం ఇదే తొలిసారి కాదన్న ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీనే ఖతం చేయాలని చూడటం సరికాదని అన్నారు. అటవీశాఖ మంత్రిగా కొండా సురేఖ తన శాఖపై ఎన్ని రివ్యూలు చేశారని ప్రశ్నించారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా ఏఐసీసీ చర్యలు తీసుకోవాలని, బహిరంగంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోకుంటే పార్టీ నష్టపోతుందని అన్నారు.








