Mahaa Daily Exclusive

  నా టార్గెట్ కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి..! మరోసారి కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు..

Share

  • నా టార్గెట్ కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి
  • మరోసారి కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ అన్నా, ఆ పార్టీ నేతలన్నా తనకు అభిమానమని వ్యాఖ్య
  • సీఎం కుటుంబసభ్యుసలపై అవీనితి ఆరోపణలున్నాయని వెల్లడి
  • సీఎం సోదరుడి కంపనీకి రూ. 200 కోట్ల భూమిని కట్టబెట్టారని ఆరోపణ

హైదరాబాద్, మహా : సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుస్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదని పేర్కొన్న కొండా సుస్మిత.. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబమేనని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక వంటి కాంగ్రెస్ అగ్రనేతలంటే తనకు గౌరవం ఉందని తెలిపారు. సీఎం కుటుంబ అవినీతి ఆరోపణలను బయటపెడతానని మరోసారి హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై గతంలో చేసిన వ్యాఖ్యలకు తాజాగా మరోసారి వివరణ ఇచ్చిన కొండా సుస్మిత .. తన టార్గెట్ కాంగ్రెస్ కాదని.. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన ఫ్యామిలీ మాత్రమేనని తేల్చి చెప్పారు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటికే వేడెక్కిన తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ అగ్రనేతలపై తనకు గౌరవం ఉందని పేర్కొన్న కొండా సుస్మిత.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లను తాను గౌరవిస్తానని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌ను విమర్శించలేదని.. కేవలం సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబంపై మాత్రమే ప్రశ్నలు లేవనెత్తానని తెలిపారు.

తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కొండా సుస్మిత.. కాంగ్రెస్ పార్టీపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని తేల్చిచెప్పారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని.. వాటినే తాను ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. తనపై కౌంటర్‌ వ్యాఖ్యలు చేయడానికి ప్రయత్నిస్తే మరిన్ని అంశాలను బయటపెడతానని తీవ్ర హెచ్చరికలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల సీటు రేవూరి ప్రకాష్ రెడ్డికే అని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై కొండా సుస్మిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు.ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించేందుకు పార్టీ హైకమాండ్ ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి ఒక్కరే 2 ఏళ్ల ముందుగానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని కొండా సుస్మిత ప్రశ్నించారు. అవసరమైతే పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి చెందిన ఒక కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారంటూ కొండా సుస్మిత మరోసారి సంచలన ఆరోపణలకు తెరతీశారు. ఈ అంశంతో పాటు రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన మరిన్ని అవినీతి, అక్రమాలను బయటపెడతానని ఆమె చేసిన హెచ్చరికలు సంచలనం రేపుతున్నాయి.

మరోవైపు.. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు వ్యవహారం కూడా ఈ వివాదం మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించడంతో ఆగస్ట్ 23వ తేదీన రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి తిరిగి వచ్చిన తర్వాత కొండా సురేఖ, కొండా సుస్మిత వ్యవహారంపై పార్టీ పరంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.

Latest