- ‘జేజీఆర్ హాస్పిటల్’పై అదనపు అంతస్తు పనులు
- – ఇంకా పూర్తి అనుమతులు తీసుకోలేదు..
- స్పష్టం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి
- – ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి.. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
- – అయినా చోద్యంచూస్తున్న అధికారులు
పిఠాపురం, మహా :
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ కొందరు కమర్షియల్ భవనాల నిర్వాహకులు అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారు. తాజాగా పట్టణంలోని ప్రముఖ కార్పొరేట్ వైద్యశాల ‘జేజీఆర్ హాస్పిటల్’ భవనంపై ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా అదనపు అంతస్తును నిర్మిస్తుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం వందలాది మంది రోగులు, వారి బంధువులతో రద్దీగా ఉండే ఒక ఆసుపత్రి భవనంపై ఇలా ఎలాంటి అధికారిక నిబంధనలు, ఇంజనీరింగ్ భద్రతా ప్రమాణాలు లేకుండా అదనపు అంతస్తును నిర్మించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో భవన స్థిరత్వానికి లోపం ఏర్పడి ఏదైనా ప్రమాదం జరిగితే రోగుల ప్రాణాలకు బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తున్నాయి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవన నిర్మాణ నిబంధనలు మరియు పురపాలక చట్టాల ప్రకారం.. ఇప్పటికే ఉన్న ఒక వాణిజ్య లేదా ఆసుపత్రి భవనంపై అదనపు అంతస్తు నిర్మించాలంటే ముందస్తుగా ఈ క్రింది కీలక అనుమతులు/ధృవీకరణలు తప్పనిసరిగా తీసుకోవాలి..
1. స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ – భవనంపై అదనపు బరువు (స్లాబ్) వేస్తే కింది అంతస్తులు, పిల్లర్లు ఆ బరువును మోయగలవా లేదా అని గుర్తింపు పొందిన స్ట్రక్చరల్ ఇంజనీర్ చేత పరీక్షించి, భద్రతా ధృవీకరణ పత్రం తీసుకోవాలి.
2. రివైజ్డ్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ : పెరిగే అంతస్తుకు అనుగుణంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం నుండి ఆన్‌లైన్ ద్వారా కొత్త ప్లాన్ అనుమతి పొందాలి. దీనికి తగిన ఫీజులు ప్రభుత్వానికి చెల్లించాలి.
3. ఫైర్ నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ : అంతస్తు పెరిగే కొద్దీ అగ్నిప్రమాద ముప్పు పెరుగుతుంది కాబట్టి, అగ్నిమాపక శాఖ నుండి సవరించిన నిరాక్షేపణ పత్రం తీసుకోవడం చట్టరీత్యా తప్పనిసరి.
4. ఫ్రీక్వెంట్ ఆక్యుపెన్సీ , పార్కింగ్ రూల్స్: పెరిగే అంతస్తుకు తగ్గట్టుగా అదనపు పార్కింగ్ స్థలం ఉందో లేదో సరిచూసుకోవాలి.
కానీ, ‘జేజీఆర్ హాస్పిటల్’ నిర్వాహకులు ఈ ప్రాథమిక నిబంధనలు వేటినీ పాటించకుండా, ముందస్తు అనుమతులు లేకుండానే నేరుగా ఐదవ అంతస్తు కోసం పిల్లర్లు లేపి, సెంటరింగ్ పనులు ప్రారంభించేయడం గమనార్హం. అదనపు అంతస్తు నిర్మించడానికి పనులు వేగంగా సాగిపోతున్నాయి.కానీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు అని స్థానికులు ఆరోపిస్తున్నారు.
‘పూర్తి అనుమతులు లేవు
ఈ వ్యవహారంపై పిఠాపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అధికారిని ని ఫోన్ ద్వారా వివరణ కోరగా.. సదరు ఆసుపత్రి భవనంపై అదనపు అంతస్తు నిర్మాణానికి సంబంధించి నిర్వాహకులు ఇంకా ఎటువంటి పూర్తి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. అనుమతులు రాకుండానే పనులు ప్రారంభించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
అయితే, పట్టణం నడిబొడ్డున ప్రధాన రహదారి పక్కనే ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా పనులు సాగుతున్నా మున్సిపల్ అధికారులు ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే సదరు అక్రమ నిర్మాణ పనులను నిలిపివేసి, నిబంధనలు ఉల్లంఘించిన భవన నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పిఠాపురం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








