Mahaa Daily Exclusive

  కత్తిపూడిలో యథేచ్ఛగా లూజ్ ఆయిల్ దందా.. బ్రాండెడ్ డబ్బాల్లో కల్తీ నూనె విక్రయాలు..? అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం..!

Share

  • చిరు వ్యాపారులే లక్ష్యంగా నకిలీ వ్యాపారం!
  •  శంఖవరం రోడ్డు ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపైనే ప్యాకింగ్!
  •  రౌతులపూడి ఏజెన్సీ ప్రాంతాలే టార్గెట్..
  • అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం!

కాకినాడ మహా పత్రిక ప్రతినిధి ఆగస్టు 21 :
కాకినాడ జిల్లా కత్తిపూడి గ్రామం లో శంఖవరం రోడ్డు ఫ్లైఓవర్ ఎయిర్టెల్ ఆఫీస్ పక్కన యు ఆర్ ఎల్ ట్రేడర్స్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న లూజ్ ఆయిల్ ప్యాకింగ్ మరియు విక్రయాల దందా ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కత్తిపూడి ఎయిర్టెల్ ఆఫీస్ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న షాపులో పగటిపూటే బహిరంగంగా ఒక మినీ వ్యాను నుండి తీసుకొచ్చిన నూనెను ఐదు లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలు మరియు పదిహేను లీటర్ల తుప్పు పట్టిన ఐరన్ డబ్బాలు, మల్టీ బ్రాండెడ్ డబ్బాలలో నింపుతూ యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. అసలు ఈ లూజ్ ఆయిల్ ఏ కంపెనీ నుండి సేకరిస్తున్నారు? ఏ హోల్‌సేల్ వ్యాపారి లేదా నకిలీ తయారీ యూనిట్ నుండి మినీ వ్యాను ద్వారా ఈ నిల్వలను కత్తిపూడికి తరలిస్తున్నారు? అనే దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టవిరుద్ధంగా నడుస్తున్న కొన్ని అనధికారిక ఆయిల్ మిల్లులు లేదా రీ-సైకిల్డ్ వ్యర్థ నూనెల మాఫియాతో ఈ వ్యాపారులకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరగాల్సి ఉంది.
*పామాయిల్‌ను సన్‌ఫ్లవర్‌గా నమ్మిస్తూ..*
నిజానికి సదరు డబ్బాలపై “URL GOLD” పామోలిన్ ఆయిల్ అని లేబుల్ ఉన్నప్పటికీ, దీనిని సన్‌ఫ్లవర్ ఆయిల్‌గా నమ్మిస్తూ రూరల్ ఏరియాలోని చిరు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు సమాచారం. హోటళ్లు, పకోడీ బండ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తక్కువ ధరకే వస్తుండటంతో ఈ నూనెను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వాడేసిన పాత ప్లాస్టిక్ డబ్బాల్లో, తుప్పు పట్టిన ఐరన్ డబ్బాలలో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో రోడ్డు పక్కన ఈ ప్యాకింగ్ ప్రక్రియ సాగుతోంది.
*ఏజెన్సీ ఏరియాలో అమాయకులే టార్గెట్*
ఇలా రోడ్డు పక్కన ప్యాక్ చేస్తున్న ఈ నాసిరకం, కల్తీ నూనె డబ్బాలను కేవలం స్థానికంగానే కాకుండా.. ఏజెన్సీ ప్రాంతమైన రౌతులపూడి మరియు దాని పరిసర గిరిజన, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న అమాయక ప్రజలు, తక్కువ ధరలకే వస్తుండటంతో స్థానిక చిరు వ్యాపారులు కొనుగోలు చేసేలా మభ్యపెడుతున్నారు. ఈ కల్తీ నూనెలను వాడటం వల్ల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు దీర్ఘకాలిక కాలేయ, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*చేతిరాతతో లేబులింగ్.. నిబంధనల ఉల్లంఘన*
నియమ నిబంధనల ప్రకారం ప్యాక్ చేసిన నూనె డబ్బాలపై పరిమాణం, బ్యాచ్ నంబర్, ధర వంటి వివరాలు కంప్యూటరైజ్డ్ లేదా ప్రింట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ విక్రయిస్తున్న డబ్బాల లేబుల్‌పై నెట్ కంటెంట్ వివరాలను చేతితో పెన్నుతో రాయడం గమనార్హం. (ఉదాహరణకు లేబుల్‌పై 14 లీటర్ల అని చేతితో రాసి ఉంది). భారతదేశంలో ఆహార భద్రతా నిబంధనల ప్రకారం లూజ్ ఎడిబుల్ ఆయిల్‌ను ఇలా ఓపెన్‌గా డబ్బాల్లో నింపి విక్రయించడం చట్టరీత్యా నేరం. ఇది ముమ్మాటికీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టాల ఉల్లంఘనేనని నిపుణులు చెబుతున్నారు.
*కల్తీ ఆయిల్ అక్రమ వ్యాపారులు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి*
ప్రజల ప్రాణాలతో, ఆరోగ్యాన్నే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్న ఇటువంటి నకిలీ వ్యాపారస్తులపై ఆహార భద్రతా అధికారులు కఠినంగా వ్యవహరించాలని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలతో కత్తిపూడిలోని సదరు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. అక్కడ ప్యాక్ చేస్తున్న ఆయిల్ నమూనాలను సేకరించి, ల్యాబ్ టెస్టుల్లో కల్తీ అని తేలితే.. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా బాధ్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ప్రజలు మరియు సామాజిక విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.

Latest