Mahaa Daily Exclusive

  ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పు సెప్టెంబరు 16న..!

Share

• అనర్హత పిటిషన్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు.
• పార్టీ మారిన పది మందిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌.

హైదరాబాద్‌, మహా.

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో కీలక దశకు చేరుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు శుక్రవారం ముగిశాయి. దీంతో కేసులో తీర్పును సెప్టెంబరు 16న వెల్లడించనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. పార్టీ మారిన తర్వాత ఆయా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించారనే విషయాన్ని నిరూపించే పలు వీడియోలు, వార్తా కథనాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
‘కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు’
ఫిరాయింపు ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాల కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చెబుతున్నప్పటికీ, వాస్తవంగా వారు కాంగ్రెస్‌ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు. ఏఐసీసీకి సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లోనూ కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారని, ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆధారాలుగా సమర్పించినట్లు తెలిపారు.
ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కండువాలు ధరించి ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన పత్రికలు, టీవీ చానళ్లలో ప్రసారమైన వార్తా కథనాలు, వీడియోలను సైతం న్యాయస్థానం ముందు ఉంచినట్లు బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది తెలిపారు.

దానం నాగేందర్‌ అంశం ప్రస్తావన.

కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌ వ్యవహారాన్ని కూడా బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ పదవిలో కొనసాగుతూనే కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని కోర్టుకు వివరించారు. పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంటూ, ఆయన రాజకీయ వ్యవహారాలను అనర్హత నిబంధనల నేపథ్యంలో పరిశీలించాలని కోరారు.

తీర్పుపైనే ఉత్కంఠ.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు.
ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో ఇక న్యాయస్థానం తీర్పుపైనే రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది. సెప్టెంబరు 16న వెలువడనున్న తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తుతో పాటు తెలంగాణ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Latest