Mahaa Daily Exclusive

  రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్..! స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ..

Share

  • రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్
  • స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
  • వివాదాలుంటే హైకోర్టులో తేల్చుకోవాలని సీజేఐ ధర్మాసనం

న్యూఢిల్లీ, మహా : రాయదుర్గం పాన్‌మక్తాలో భూముల వేలానికి లైన్ క్లియర్ అయింది. రాయదుర్గంలోని 11 ఎకరాల భూముల వేలం ప్రక్రియను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వివాదాలుంటే హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. కంచె గచ్చిబౌలి వివాదాస్పద భూములకు, వీటికి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఏవైనా అభ్యంతరాలు లేదా వివాదాలు ఉంటే సంబంధిత పిటిషనర్లు తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాయదుర్గం పాన్‌మక్తా పరిధిలోని 2 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 11 ఎకరాల భూమి విక్రయం కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వేలం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వేలంలో ఒక్కో ఎకరాకు రూ.175 కోట్ల కనీస ధరను (అప్‌సెట్ ప్రైస్) నిర్ణయించారు. అయితే, ఈ భూముల వేలాన్ని సవాలు చేస్తూ జువ్వాడి ప్రణయ్ సింహారావు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

గతంలో కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, అప్పట్లో పరిరక్షించాలని ఆదేశించిన భూములనే ప్రభుత్వం ఇప్పుడు వేలానికి ఉంచగా నోటిఫికేషన్ ఇచ్చిందని పిటిషనర్ తరఫు సీనియర్ లాయర్ నీరజ్ కిషన్ కౌల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ వాదనలను తీవ్రంగా ఖండించారు. పిటిషనర్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో స్టే ఇచ్చిన భూములకు, ప్రస్తుతం వేలం వేస్తున్న భూములకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కంచె గచ్చిబౌలి భూములకు, ఇప్పుడు టీజీఐఐసీ వేలం వేస్తున్న ప్రాంతానికి మధ్య సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉందని స్పష్టమైన ఆధారాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ ధర్మాసనం టీజీఐఐసీ జారీ చేసిన వేలం నోటిఫికేషన్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.

హైకోర్టులో దక్కని స్టే

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని భూముల వేలాన్ని నిలిపివేసేందుకు హైకోర్టు ఇదివరకే నిరాకరించింది. సర్వే నంబర్లు 83/1, 83/పార్ట్‌లో ఉన్న 11.12 ఎకరాల వేలంపై దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై సింగిల్ జడ్జీలు విచారణ జరిపి మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పిటిషనర్లు ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ (ఎల్‌ఆర్‌టీ)ని ఆశ్రయించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, పునర్విచారణ పెండింగ్‌లో ఉన్నట్లు నిరూపించకుండా ప్రభుత్వ వేలాన్ని అడ్డుకోలేమని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు, ప్లాట్ల వేలాన్ని సవాల్ చేస్తూ ఎస్. రవీంద్రనాథ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ నగేష్ భీమపాక.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, హెచ్‌ఎండీఏలను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 19 కి వాయిదా వేశారు.

Latest