Mahaa Daily Exclusive

  ‘రాహుల్‌ను ప్రధానిని చేయడమే కాంగ్రెస్ లక్ష్యం’..! పార్టీపై తన వైఖరి స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి..

Share

యాదాద్రి భువనగిరి, మహా.

కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చూడడమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను పార్టీకి దూరంగా ఉంటున్నాననే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసిన ఆయన, కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే కార్యకర్తలకు అండగా నిలుస్తున్నానని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 

‘పార్టీ కాదు.. కొన్ని నిర్ణయాలపైనే అభ్యంతరం’

 

తాను కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కేవలం కొన్ని నిర్ణయాలపై మాత్రమే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలు, పార్టీ బలోపేతం దృష్ట్యా తన అభిప్రాయాలను నేరుగా వెల్లడించడం తప్ప, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు.

 

‘రాహుల్‌తో ప్రత్యేక అనుబంధం’

 

తెలంగాణలో ఏ నాయకుడికీ దక్కని స్థాయిలో రాహుల్ గాంధీ తనకు సమయం కేటాయించారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పార్టీ వ్యవహారాలతో పాటు కుటుంబానికి సంబంధించిన అనేక అంశాలపై కూడా రాహుల్ గాంధీతో విస్తృతంగా చర్చించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. పార్టీలో తనకు ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

 

రాహుల్‌పై ప్రశంసలు

 

రాహుల్ గాంధీ మానవత్వం కలిగిన గొప్ప నాయకుడని రాజగోపాల్ రెడ్డి కొనియాడారు. దేశ ప్రజల సమస్యలపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉందని, ప్రజలతో మమేకమయ్యే నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మరింత బలపరచడమే కార్యకర్తల లక్ష్యంగా ఉండాలని సూచించారు.

 

కార్యకర్తలకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే

 

పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసేవతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తామని, అందులో భాగంగానే ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.