ఫేజ్-2కు వేగం..
* మెట్రో స్వాధీనానికి కేంద్రం సహకారం కోరిన సీఎం.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడంతో పాటు, తొలి దశ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు రాసి ప్రాజెక్టు పురోగతిపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గత నెల 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి తన లేఖల్లో ప్రస్తావించారు. మెట్రో తొలి దశ ఆస్తుల విలువ నిర్ధారణ, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ, రెండో దశ విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థ ఎస్బీఐ క్యాప్స్‌కు అప్పగించేందుకు అంగీకారం కుదిరిందని గుర్తు చేశారు.
అయితే, ఈ ప్రక్రియలో భాగంగా ఎస్బీఐ క్యాప్స్‌కు అప్పగించాల్సిన విధి విధానాలను ఇప్పటివరకు ఖరారు చేయకపోవడం, అధికారిక నియామకంలో ఆలస్యం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ జాప్యం కారణంగా మెట్రో తొలి దశ నిర్వహణలో అనిశ్చితి నెలకొనడమే కాకుండా, రెండో దశ వివరణాత్మక ప్రాజెక్టు నివేదికల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు కూడా ఆలస్యమవుతున్నాయని వివరించారు.
ప్రాజెక్టు అమలు మరింత ఆలస్యమైతే నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. హైదరాబాద్ నగర భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే మెట్రో రెండో దశ విస్తరణ అత్యంత కీలకమని, ఇందులో ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలయ్యేలా చూడాలని ఇద్దరు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. దీంతో మెట్రో తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తవడంతో పాటు, రెండో దశ విస్తరణ పనులకు కూడా వేగం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.







